IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- July 16, 2026
న్యూ ఢిల్లీ: రైలు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్లో ఎదురయ్యే చిన్నపాటి ఇబ్బందులకు, విసుగుకు భారతీయ రైల్వే త్వరలోనే శాశ్వతంగా తెరదించనుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చే లక్ష్యంతో సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన వెబ్సైట్ బీటా వెర్షన్‌ను రైల్వే శాఖ తాజాగా ప్రారంభించింది. ఈ సరికొత్త పోర్టల్‌పై వినియోగదారుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన అనంతరం, దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
క్యాప్చా తిప్పలు తప్పుతాయి..ఒకే క్లిక్‌తో సీట్ల లభ్యత!
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త వెబ్సైట్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు చేశారు. టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులకు పదేపదే ఎదురయ్యే క్యాప్చా ఎంటర్ చేసే విధానాన్ని గణనీయంగా తగ్గించారు. ఎలాంటి అనవసరమైన పాపప్‌లు, ప్రకటనలు (Ads) లేకుండా ప్రశాంతంగా బుకింగ్ చేసుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఇప్పటివరకు వేర్వేరు క్లాసులలో సీట్ల లభ్యతను తెలుసుకోవాలంటే పలుమార్లు క్లిక్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల (స్లీపర్, 3ఏసీ, 2ఏసీ మొదలైనవి) సీట్ల లభ్యతను నేరుగా చూసుకునేలా మార్పులు తీసుకువచ్చారు. టికెట్ బుకింగ్ కోసం పూర్తి చేయాల్సిన దశల సంఖ్యను తగ్గించి, ప్రక్రియను మరింత స్పీడ్‌గా మార్చారు. తరచూ ప్రయాణించే వారి కోసం ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకునే సదుపాయాన్ని కూడా మెరుగుపరిచారు.
విద్యార్థుల ఐడియాతో మారిన IRCTC ముఖచిత్రం
ఈ అద్భుతమైన మార్పుల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థులు జరిపిన సమావేశంలో ఈ సూచనలు అందాయి. వెబ్సైట్ డిజైన్, యూజర్ అనుభవాన్ని (UI/UX) మెరుగుపరచడంపై విద్యార్థులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు సలహాలు ఇచ్చారు. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే రైల్వే శాఖ ఈ కొత్త వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, 2002లో ప్రారంభమైన ఐఆర్సీటీసీ ద్వారా ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 14.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండటం విశేషం.
కొత్త వెబ్‌సైట్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?
ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఈ నూతన వెబ్‌సైట్‌ను వినియోగదారులు రెండు విధాలుగా యాక్సెస్ చేయవచ్చు:
- నేరుగాhttp://irctc.co.in అనే వెబ్సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కొత్త పోర్టల్‌ను చూడొచ్చు.
- లేదా ప్రస్తుత ఐఆర్సీటీసీ హోమ్‌పేజీలో పైన కనిపించే ‘బీటా వెర్షన్’ (Beta Version) లింక్‌ను ఎంచుకోవడం ద్వారా దీనిని అనుభవించవచ్చు.
ఈ ట్రయల్ రన్ పూర్తికాగానే, కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో ఈ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత రాబోయే కొద్ది వారాల్లోనే ఈ నూతన పోర్టల్ అధికారికంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







