భారత్ పై రెండో వన్డేలో విజయం..
- July 17, 2026
లండన్: కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు.
రెండో వన్డే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (66; 71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (65; 66 బంతుల్లో 8 ఫోర్లు) అర్థశతకాలు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సాకిబ్ మహమూద్ రెండు, సామ్ కరన్, విల్ జాక్స్ లు తలా వికెట్ సాధించారు.
ఆ తరువాత జో రూట్ (99 నాటౌట్; 133 బంతుల్లో 9 ఫోర్లు) చెలరేగడంతో 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సామ్ కరన్ (26; 31 బంతుల్లో 4 ఫోర్లు), విల్ జాక్స్ (30; 44 బంతుల్లో 2 ఫోర్లు), గస్ అట్కిన్సన్ (23 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
మా దృష్టంతా ఆదివారం మ్యాచ్‌పైనే..
రెండో వన్డేలో విజయం సాధించడం పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం ఎంతో ముఖ్యమన్నాడు. సిరీస్‌లో తాము ఇంకా పోటీలోనే ఉన్నామన్నాడు. ఆదివారం జరగనున్న ఆఖరిదైన మూడో వన్డే కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక భారత్‌ను 233 పరుగులకే కట్టడి చేయడంపై మాట్లాడుతూ.. 30 ఓవర్ల సమయంలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులతో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించేలా కనిపించిందన్నాడు. ఆ సమయంలో తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని 60 పరుగులకే మిగిలిన ఏడు వికెట్లు తీసి ఆలౌట్ చేయడం నిజంగా అద్భుతం అని అన్నాడు. ముఖ్యంగా సామ్ కరన్, విల్ జాక్స్‌లు చాలా బాగా బంతులు వేశారన్నాడు.
అదనపు సీమర్‌ను తీసుకోవడం పై మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ‘జట్టు ఎంపికలో మేము ప్రధానంగా పరిస్థితులనే పరిగణనలోకి తీసుకున్నాము. మరో రోజున అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాల్సి రావచ్చు, కానీ ఈ రోజు అదనపు సీమర్ సరైన ఎంపిక అని భావించాము.’ అని అన్నాడు. ఇక జోరూట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. చాలా ఏళ్లుగా స్ట్రైక్ రొటేట్ చేయడంలో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని కితాబు ఇచ్చాడు.
రెండేళ్ల క్రితం అతను ఆడిన ఒక ఇన్నింగ్స్ నాకు గుర్తుంది. అందులో కేవలం మూడు ఫోర్లు కొట్టి అతను 100 పరుగులు సాధించాడు. అది నిజంగా అద్భుతం. అతను స్ట్రైక్ రొటేట్ చేయడంలో దిట్ట. వన్డే క్రికెట్‌లో ఇది చాలా కీలకమైన అంశం అని అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్ 2027 గురించి మాట్లాడుతూ.. దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. రోజువారిగానే ఆలోచిస్తామన్నాడు. ఒకవేళ మెగాటోర్నీకి అర్హత సాధించాల్సి వస్తే.. సాధిస్తాము. ఇప్పుడు మా దృష్టి అంతా ఆదివారం మ్యాచ్‌పైనే ఉంది. అక్కడికి చేరుకున్నాక పిచ్ పరిస్థితులను చూసి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకుని సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాము అని హ్యారీ బ్రూక్ అన్నాడు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







