రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!

- July 19, 2026 , by Maagulf
రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!

మనామా: ఇళ్లు లేదా దుకాణాల పరిధిని దాటి రోడ్లు, ఫుట్‌పాత్‌లపై బట్టలు ఆరేస్తే BD100 వరకు జరిమానా విధించనున్నట్లు నార్తెర్న్ ఏరియా మున్సిపాలిటీ హెచ్చరించింది. ఇల్లు లేదా దుకాణం సరిహద్దులను దాటి ప్రజా ప్రదేశాల్లో బట్టలు ఆరేసేందుకు ఉపయోగించే తాడులు, స్టాండ్లు, ర్యాక్‌లు ఏర్పాటు చేయడం ప్రజా స్థలాన్ని అక్రమంగా ఆక్రమించినట్లేనని మున్సిపాలిటీ పేర్కొంది. ఇలాంటి ఉల్లంఘనలను అనుమతి లేకుండా ఏర్పాటు చేసే కార్ షేడ్లు, బ్యారికేడ్లు, తాత్కాలిక కంచెలతో సమానంగా పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో  ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఉల్లంఘనలకు BD50 నుంచి BD300 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, కేసును కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించుకోవాలనుకునే వారు గరిష్ఠ జరిమానాలో మూడో వంతైన BD100 చెల్లించి సెటిల్ చేసుకోవచ్చని వెల్లడించింది.

రోడ్లు, ఫుట్‌పాత్‌లు లేదా ఇతర ప్రజా ప్రదేశాలపైకి బట్టలు, తాడులు, స్తంభాలు లేదా ర్యాక్‌లు విస్తరించినా ఈ నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ అధికారులు వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటారు. హెచ్చరికను పట్టించుకోకపోతే సంబంధిత వస్తువులను యజమాని ఖర్చుతో తొలగిస్తారు. బహ్రెయిన్ ప్రజా రహదారుల ఆక్రమణ చట్టం ప్రకారం, అనుమతి లేకుండా రోడ్లు లేదా ఫుట్‌పాత్‌లపై వస్తువులు పెడితే BD20 నుంచి BD500 వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే స్థలాన్ని శుభ్రం చేసే ఖర్చుతో పాటు సంబంధిత ఫీజుకు రెండింతలు చెల్లించాలని కోర్టు ఆదేశించే అవకాశం కూడా ఉంది.

అయితే, పూర్తిగా వ్యక్తిగత స్థలంలోనే బట్టలు ఆరేస్తే ఈ నిబంధనలు వర్తించదు. పబ్లిక్ మార్గాలను ఆక్రమించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం లేదా రోడ్డు, ఫుట్‌పాత్‌ ను వినియోగించినప్పుడు మాత్రమే ఉల్లంఘనగా పరిగణిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com