ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!

- July 24, 2026 , by Maagulf
ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!

ఫుజైరా: యూఏఈలోని ఫుజైరా–ఖోర్‌ఫక్కాన్ రోడ్డుపై జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ల మహిళ, ఆమె ఏడాది వయస్సు గల కుమార్తె మృతి చెందారు. భర్తతో పాటు మూడు సంవత్సరాల మరో కుమార్తె ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఫుజైరాలోని షేక్ ఖలీఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం..  ఎమిరాటి కుటుంబం ఫుజైరా–ఖోర్‌ఫక్కాన్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఫౌజ్ పెట్రోలియం ప్రాంతంలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వారి కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే ఫుజైరా పోలీసుల అత్యవసర బృందాలు, నేషనల్ అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి, ఏడాది చిన్నారి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. తండ్రి, పెద్ద కుమార్తెకు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలకు గురువారం ఖోర్‌ఫక్కాన్‌లో ఇషా నమాజ్ అనంతరం అంత్యక్రియలు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నివాళులర్పించారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ దృష్టి మరలడం (డిస్ట్రాక్షన్) కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు పరిశీలిస్తున్నారు.

డ్రైవర్లకు ఫుజైరా పోలీసుల హెచ్చరిక

ఈ ఘటన నేపథ్యంలో ఫుజైరా పోలీసులు వాహనదారులకు మరోసారి అప్రమత్తత సూచించారు. ఫుజైరా పోలీసు ట్రాఫిక్ అండ్ పట్రోల్స్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సాలెహ్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ధన్హానీ మాట్లాడుతూ..  డ్రైవింగ్ సమయంలో క్షణిక నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల వద్దకు చేరుకునే సమయంలో వేగాన్ని తగ్గించాలని, సురక్షిత దూరాన్ని పాటించాలని, ఓవర్‌టేక్ చేసే ముందు పక్క లేన్లు ఖాళీగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.

అలాగే ఆకస్మికంగా లేన్ మార్చడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా డ్రైవింగ్‌పై దృష్టి మరల్చే ఏ చర్యనైనా నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించాలని వాహనదారులకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com