ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!

- July 26, 2026 , by Maagulf
ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!

మస్కట్: రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఒమన్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడం, మార్కెట్‌లో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా సమగ్ర చట్టాలు, నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు గృహనిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం ప్రాపర్టీ అభివృద్ధి, నిర్మాణానికి ముందే విక్రయాలు, రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్, ఆస్తుల విలువ నిర్ధారణ, ఉమ్మడి ఆస్తుల నిర్వహణ, ఎస్క్రో ఖాతాలు వంటి కీలక అంశాలకు ఒకే చట్టపరమైన వ్యవస్థను కల్పిస్తోంది.

రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఏ ప్రాజెక్టును ప్రచారం చేయడానికి లేదా విక్రయించడానికి ముందు తప్పనిసరిగా అన్ని లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రాజెక్టులు చట్టపరమైన, సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయనే నమ్మకం కొనుగోలుదారులకు కలుగుతుందని తెలిపారు.అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టడం, ప్రచారం చేయడం లేదా విక్రయించడం, ఎస్క్రో ఖాతాల నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు కఠినమైన చట్టపరమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే ముందు డెవలపర్‌తో పాటు ప్రాజెక్టు కూడా మంత్రిత్వ శాఖలో అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని పెట్టుబడిదారులకు సూచించింది.

ఇదిలా ఉండగా, ఒమన్‌లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2026 జూన్ చివరి నాటికి రియల్ ఎస్టేట్ లావాదేవీల విలువ 5.4 శాతం పెరిగి OMR 1.434 బిలియన్లకు చేరింది. విదేశీ పెట్టుబడులు OMR 60 మిలియన్లకు పైగా నమోదవగా, గల్ఫ్ దేశాల పెట్టుబడిదారులు OMR 13 మిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. 2026 జూన్ నాటికి 190కు పైగా రియల్ ఎస్టేట్ సంస్థలు మంత్రిత్వ శాఖలో నమోదు కావడం ఈ రంగం వృద్ధికి నిదర్శనంగా నిలిచింది. 2025లో ఒమన్ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో రియల్ ఎస్టేట్ రంగం సుమారు OMR 1.08 బిలియన్ల వాటా అందించినట్లు గణాంకాలు వెల్లడించాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com