చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!

- July 26, 2026 , by Maagulf
చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!

దోహా: ఖతార్‌లో ఇటీవల అమల్లోకి వచ్చిన చక్కెర కలిగిన పానీయాలపై ఎక్సైజ్ పన్నుకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలపై జనరల్ టాక్స్ అథారిటీ (GTA) క్లారిటీ ఇచ్చింది. అన్ని చక్కెర ఉత్పత్తులపై లేదా అన్ని శీతల పానీయాలపై ఒకే విధంగా పన్ను విధించడం లేదని స్పష్టం చేసింది.  జూలై 6 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం, పానీయంలోని చక్కెర పరిమాణం ఆధారంగా ఎక్సైజ్ పన్ను విధిస్తున్నట్లు జీటీఏ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక వివరాలను తెలియజేసింది.

జీటీఏ తెలిపిన వివరాల ప్రకారం, డైట్ మరియు జీరో షుగర్ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్‌కు 0 శాతం ఎక్సైజ్ పన్ను మాత్రమే వర్తిస్తుంది. అలాగే, అన్ని చక్కెర పదార్థాలకు ఈ పన్ను వర్తించదని, అదనపు చక్కెర కలిపి తయారు చేసిన ప్రీ-ప్యాకేజ్డ్ స్వీటెండ్ డ్రింక్స్ ‌కు మాత్రమే ఈ పన్ను అమలులో ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా, రెస్టారెంట్లు, కేఫేల్లో తాజాగా తయారు చేసి వెంటనే వినియోగానికి అందించే పానీయాలకు ఎక్సైజ్ పన్ను ఉండదని స్పష్టం చేసింది. పానీయంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే తక్కువ లేదా సున్నా పన్ను, ఎక్కువగా ఉంటే అధిక పన్ను విధించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ఇక ఎనర్జీ డ్రింక్స్ మాత్రం ఈ కొత్త విధానానికి వర్తించవని, వాటిపై ఇప్పటికే అమల్లో ఉన్న 100 శాతం ఎక్సైజ్ పన్ను కొనసాగుతుందని జీటీఏ వెల్లడించింది. ప్రజలు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడం, ఖతార్ నేషనల్ విజన్-2030లోని ప్రజారోగ్య లక్ష్యాలను సాధించడమే ఈ విధానం ఉద్దేశమని జీటీఏ పేర్కొంది. అలాగే, చక్కెర పానీయాలపై వసూలయ్యే ఎక్సైజ్ పన్ను ఆదాయంలో 1 శాతం మొత్తాన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com