మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి

- August 01, 2026 , by Maagulf
మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి

న్యూఢిల్లీ/మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో రూల్–377 కింద ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మత్స్యశాఖ దృష్టికి పలు కీలక డిమాండ్లను తీసుకువెళ్లారు.

ప్రధానమంత్రి రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం సుమారు 20 నుంచి 22 లక్షల జనాభాతో పాటు పడవల నిర్మాణం, మత్స్య పరిశ్రమ, రొయ్యలు, సముద్ర ఆహార ఎగుమతులకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం అని పేర్కొన్నారు.

అయితే ఈ ప్రాంత మత్స్యకారులు ప్రస్తుతం పడవల నిర్మాణ వ్యయం పెరగడం, చేపల వేట సామగ్రి ఖరీదు అధికమవడం, కేంద్ర సబ్సిడీ పథకాల కింద అందుతున్న ఆర్థిక సహాయం సరిపోకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి తక్షణమే పలు కీలక డిమాండ్లను పరిశీలించి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

బాలశౌరి చేసిన ప్రధాన డిమాండ్లు:

  • చిన్న చేపల వేట పడవల యూనిట్ వ్యయాన్ని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచాలి.
  • చేపల వేట వలల ధరలు పెరిగినందున వాటిపై అందిస్తున్న రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని రూ.1 లక్షకు పెంచాలి.
  • పడవల ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1.35 లక్షల సబ్సిడీని రూ.2 లక్షలకు పెంచాలి.

మచిలీపట్నం ప్రాంతంలోని వేలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన అమలు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com