హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్‌లో డేటా లీక్ కలకలం..కేసు నమోదు

- August 03, 2026 , by Maagulf
హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్‌లో డేటా లీక్ కలకలం..కేసు నమోదు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన రోగులు, ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఫిర్యాదు ప్రకారం, రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులతో పాటు ఆస్పత్రికి సంబంధించిన అంతర్గత గోప్య సమాచారాన్ని కూడా ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్‌ను వాట్సాప్ ద్వారా పంచుకున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు.

ఈ డేటా లీక్‌లో రోగులతో పాటు ఆస్పత్రి ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం కూడా బయటపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు గుర్తింపు చోరీ (Identity Theft), ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.

డేటా లీక్‌కు కారణమైన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వెబ్‌సైట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని సీఈవో పోలీసులను కోరారు. అలాగే, దర్యాప్తులో కీలకమైన సర్వర్ లాగ్స్, మెటాడేటా తదితర డిజిటల్ ఆధారాలను భద్రపరిచి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com