సౌదీలో ఆన్‌లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!

- August 04, 2026 , by Maagulf
సౌదీలో ఆన్‌లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఆన్‌లైన్ షాపింగ్‌లో వినియోగదారులు స్థానిక రిటైలర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) విడుదల చేసిన సౌదీ ఇంటర్నెట్ రిపోర్ట్–2026 ప్రకారం.. దేశంలో జరిగిన ఆన్‌లైన్ కొనుగోళ్లలో 95.3 శాతం స్థానిక రిటైలర్ల ద్వారా జరిగాయి. అంతర్జాతీయ షాపింగ్ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోళ్లు 55.4 శాతానికి పరిమితమయ్యాయి.

నివేదిక ప్రకారం, సౌదీలో 76.9 శాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో దుస్తులు, పాదరక్షలు మొదటి స్థానంలో నిలిచాయి. వీటి కొనుగోలు 87.7 శాతంగా నమోదైంది. అనంతరం సౌందర్య ఉత్పత్తులు (46.2%), కిరాణా సరుకులు (41.8%), కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు (36.9%), ప్రయాణ సేవలు (36.5%) ఉన్నాయి.

ప్రాంతాల వారీగా చూస్తే ఈస్టర్న్ ప్రావిన్స్లో ఆన్‌లైన్ షాపింగ్ అత్యధికంగా 85.2 శాతం నమోదైంది. ప్రభుత్వ డిజిటల్ సేవల వినియోగంలో కూడా సౌదీ ప్రజలు ముందంజలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలో 96 శాతం మంది ప్రభుత్వ డిజిటల్ సేవలను వినియోగిస్తున్నారు. తబుక్, ఖాసిం ప్రాంతాల్లో ఈ సేవల వినియోగం అత్యధికంగా 98.6 శాతం ఉండగా, అల్-బాహా ప్రాంతంలో అత్యల్పంగా 92.4 శాతం నమోదైంది.

డిజిటల్ బ్యాంకింగ్ సేవలను 85.9 శాతం మంది వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈస్టర్న్ ప్రావిన్స్‌లో వినియోగం అత్యధికంగా 89.6 శాతం ఉండగా, నజ్రాన్ ప్రాంతంలో అత్యల్పంగా 78.1 శాతం నమోదైంది.డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, 2025 చివరి నాటికి సౌదీ కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక రంగం మార్కెట్ విలువ 199 బిలియన్ సౌదీ రియాల్స్‌కు చేరుకుంది. గత ఐదేళ్లలో ఈ రంగం ఏడాదికి సగటున 8 శాతం వృద్ధి నమోదు చేసి, మిడిలీస్టు–ఉత్తర ఆఫ్రికా (MENA) ప్రాంతంలో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా సౌదీ అరేబియా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని నివేదిక వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com