ఫోర్బ్స్ టాప్-100 సీఈఓల జాబితాలో ఖతార్‌ కార్పొరేట్ దిగ్గజాలు వీరే..!!

- August 07, 2026 , by Maagulf
ఫోర్బ్స్ టాప్-100 సీఈఓల జాబితాలో ఖతార్‌ కార్పొరేట్ దిగ్గజాలు వీరే..!!

దోహా: ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ విడుదల చేసిన 'టాప్-100 సీఈఓలు – 2026' జాబితాలో ఖతార్‌కు చెందిన సంస్థలను నడిపిస్తున్న 11 మంది సీఈఓలు చోటు దక్కించుకున్నారు. బ్యాంకింగ్, ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, బీమా, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో విశేష నాయకత్వాన్ని ప్రదర్శించిన వారికి ఈ గుర్తింపు లభించింది.
ఈ ఏడాది జాబితాలో మిడిల్ ఈస్ట్ లోని 21 దేశాల నుంచి 102 మంది సీఈఓలు ఎంపికయ్యారు. ఇందులో బ్యాంకింగ్ రంగానికి చెందిన 30 మంది సీఈఓలు ఉండగా, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు చెందిన 8 మంది చొప్పున స్థానం దక్కించుకున్నారు.
సంస్థల ఆర్థిక పనితీరు, వ్యాపార వృద్ధి, డిజిటల్ పరివర్తన, ఏఐ వినియోగం, సుస్థిర అభివృద్ధి, ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ విభాగం వెల్లడించింది.

 ఖతార్‌కు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు

ఖతార్ ఎనర్జీ అధ్యక్షుడు, సీఈఓతో పాటు దేశ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి హెచ్.ఇ. సాద్ షెరిదా అల్-కాబీ జాబితాలో స్థానం సంపాదించారు. 2026లో సిరియాలో సముద్ర గర్భ చమురు, వాయువు అన్వేషణకు అంతర్జాతీయ భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు, సైప్రస్ గ్యాస్ నిల్వలను ఈజిప్ట్ గ్యాస్ మౌలిక సదుపాయాల ద్వారా అభివృద్ధి చేసి మార్కెటింగ్ చేసే అంశంపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే కాంగో రిపబ్లిక్ సముద్ర గర్భంలో కొత్త హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించినట్లు ప్రకటించారు.

క్యూఎన్‌బీ గ్రూప్ సీఈఓ అబ్దుల్లా ముబారక్ అల్ ఖలీఫా కూడా జాబితాలో నిలిచారు. 28కి పైగా దేశాల్లో 900కుపైగా శాఖలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యూఎన్‌బీ 2026 తొలి త్రైమాసికంలో 387.3 బిలియన్ డాలర్ల ఆస్తులు, 1.2 బిలియన్ డాలర్ల నికర లాభం నమోదు చేసింది.

ఊరేదూ గ్రూప్ సీఈఓ అజీజ్ అల్ ఉత్మాన్ ఫఖ్రూ, ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ (QIB) గ్రూప్ సీఈఓ బాసెల్ గమాల్, ఖతార్ ఇన్సూరెన్స్ గ్రూప్ సీఈఓ సలేం అల్ మన్నై కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఖతార్ ఇన్సూరెన్స్ గ్రూప్ తొలి త్రైమాసికంలో 879 మిలియన్ డాలర్ల స్థూల బీమా ప్రీమియంలు నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 13 శాతం వృద్ధి సాధించింది.

దోహా బ్యాంక్ గ్రూప్ సీఈఓ షేక్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ ఫహద్ బిన్ ఫైసల్ అల్ థానీ సుస్థిర అభివృద్ధి, డిజిటల్ ఫైనాన్స్ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపు పొందారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ నౌకా రవాణా సంస్థల్లో ఒకటైన నఖిలాత్ సీఈఓ అబ్దుల్లా అల్ సులైతి కూడా జాబితాలో నిలిచారు. దక్షిణ కొరియాలో 25 కొత్త ఎల్‌ఎన్‌జీ నౌకలతో పాటు ఎల్‌పీజీ, అమ్మోనియా నౌకల నిర్మాణం కొనసాగుతోంది.

ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ (QFC) సీఈఓ మన్సూర్ అల్ ఖాతర్ 2026 జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి త్రైమాసికంలో 800కుపైగా కొత్త కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేశారు. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 57 శాతం అధికం.

ఖతార్ ఫ్రీ జోన్స్ అథారిటీ (QFZ) సీఈఓ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ ఫైసల్ అల్ థానీ నాయకత్వంలో 2025 చివరి నాటికి 837 కంపెనీలు లైసెన్సులు పొందగా, 5.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 13 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు ఏర్పడ్డాయి.

అదే విధంగా ఖతార్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సీఈఓ అబ్దుల్‌రహ్మాన్ బిన్ హిషామ్ అల్ సువైదీ, దుఖాన్ బ్యాంక్ యాక్టింగ్ గ్రూప్ సీఈఓ అహ్మద్ హషెమ్ కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దుఖాన్ బ్యాంక్ తొలి త్రైమాసికంలో 117.8 మిలియన్ డాలర్ల నికర లాభం, 34.7 బిలియన్ డాలర్ల మొత్తం ఆస్తులు నమోదు చేసింది.

ఫోర్బ్స్ జాబితాలో ఖతార్‌కు చెందిన 11 మంది సీఈఓలు స్థానం సంపాదించడం ద్వారా, ఖతార్ నేషనల్ విజన్-2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక సేవలు, ఇంధనం, సాంకేతికత, లాజిస్టిక్స్, ఆవిష్కరణ రంగాల్లో దేశం ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా మరింత బలోపేతమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com