అబుదాబి, దుబాయ్ పార్కింగ్ సేవలు అనుసంధానం.. ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా పేమెంట్స్..!!
- August 10, 2026
*అబుదాబి: అబుదాబి, దుబాయ్‌లలో పార్కింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు కీలక ఒప్పందం కుదిరింది. రెండు ఎమిరేట్లకు చెందిన పార్కింగ్ సంస్థలు తమ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థలను అనుసంధానం చేసి, సేవలను అందించేందుకు అంగీకరించాయి. ఈ మేరకు అబుదాబికి చెందిన క్యూ మొబిలిటీ (Q Mobility), దుబాయ్‌కి చెందిన పార్కిన్ (Parkin) సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా రెండు సంస్థలు తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టనున్నాయి. దీంతో అబుదాబి లేదా దుబాయ్‌లో ఎక్కడ ఉన్నా.. నివాసితులు, సందర్శకులు ఒకే ఛానల్ ద్వారా పార్కింగ్ సేవలను పొందడంతో పాటు పార్కింగ్ ఫీజులను చెల్లించే అవకాశం కలుగుతుంది.
ఏఐతో పార్కింగ్ నిర్వహణ
ఒప్పందంలో భాగంగా ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించే పైలట్ ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నారు. పార్కింగ్ స్థలాల్లో ఖాళీలను గుర్తించడం, డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై ఈ సాంకేతికతలను వినియోగించనున్నారు. అలాగే అమల్లో ఉన్న నిబంధనలు, డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా డేటా, సాంకేతిక నైపుణ్యాలను పరస్పరం పంచుకునే అవకాశాలను రెండు సంస్థలు పరిశీలించనున్నాయి. పార్కింగ్ వ్యవస్థల నిర్వహణలో పాలనా విధానాలను బలోపేతం చేయడం, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించడంపైనా దృష్టి సారించనున్నాయి.
క్యూ మొబిలీటీ సీఈఓ మహమ్మద్ హుసైన్ కర్మస్తాజీ మాట్లాడుతూ.. రెండు ఎమిరేట్లలో మరింత స్మార్ట్, అనుసంధానిత రవాణా వ్యవస్థ దిశగా ఈ భాగస్వామ్యం కీలక అడుగు అని తెలిపారు. పార్కిన్ సీఈఓ ఇంజినీర్ మహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ ఈ ఒప్పందాన్ని యూఏఈ పార్కింగ్ రంగంలో వ్యూహాత్మక మైలురాయిగా అభివర్ణించారు. పార్కింగ్ సేవలు ఇక ప్రత్యేకమైన సేవగా కాకుండా నగర రవాణా వ్యవస్థలో కీలక భాగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 12 కిలోల ఉల్కాశకలం గుర్తింపు..!!
- కువైట్‌లో 53 శాతం తగ్గిన నేరాలు సంఖ్య..!!
- ఫ్రాడ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, బహ్రెయిన్ నుంచి బహిష్కరణ..!!
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
- అబుదాబి, దుబాయ్ పార్కింగ్ సేవలు అనుసంధానం.. ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా పేమెంట్స్..!!
- పర్యాటక రంగంలో సౌదీ అరేబియా దూకుడు.. జీడీపీలో 14.1 శాతం వాటా..!!
- ఖతార్ ఎయిర్వేస్ పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్..ప్రయాణికులకు హెచ్చరిక..!!
- భారతీయ పర్యాటకులకు ఉచిత యూఏఈ వీసా..అబుదాబి కొత్త హాలిడే ఆఫర్
- టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం
- ఆన్లైన్లో ఈ పనులు చేస్తే జైలుశిక్ష.. Dh500,000 ఫైన్..!!







