ఫ్రాడ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, బహ్రెయిన్‌ నుంచి బహిష్కరణ..!!

- August 10, 2026 , by Maagulf
ఫ్రాడ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, బహ్రెయిన్‌ నుంచి బహిష్కరణ..!!

మనామా: క్లీనింగ్ ఉత్పత్తులపై గడువు తేదీలను తొలగించి విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులకు బహ్రెయిన్‌లోని లోయర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన వెంటనే ఇద్దరినీ దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.  

బుడాయా పోలీస్ స్టేషన్‌కు ఓ ప్రముఖ రిటైల్ స్టోర్ నుంచి ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, సరఫరాదారు సంస్థకు చెందిన మరో ఉద్యోగి కలిసి క్లీనింగ్ ఉత్పత్తుల ప్యాకేజీలపై ఉన్న గడువు తేదీలను తొలగించినట్లు స్టోర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు లభించాయి. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో గడువు తేదీలు తొలగించిన పలు ప్యాకేజీలతో పాటు ఇప్పటికే గడువు ముగిసిన ఇతర ఉత్పత్తులు కూడా గుర్తించారు. గడువు తేదీలను తొలగించేందుకు ఉపయోగించిన పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో ఇద్దరు నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. గడువు ముగిసిన ఉత్పత్తులను తనిఖీ చేసే బాధ్యత తనపై ఉండటంతో.. వాటి కారణంగా జీతం నుంచి కోత పడుతుందనే భయంతో గడువు తేదీలను తొలగించినట్లు స్టోర్ ఉద్యోగి విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com