ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్‌ ఫోకస్..!!

- August 13, 2026 , by Maagulf
ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్‌ ఫోకస్..!!

కువైట్‌: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో రవాణా, లాజిస్టిక్స్‌ ఖర్చులు పెరుగుతుండటంతో వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకు.. దేశంలో సరుకుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ షిప్పింగ్‌ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కువైట్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. హోర్ముజ్‌ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలు సముద్ర రవాణా, షిప్పింగ్‌ మార్గాలపై చూపుతున్న ప్రభావంపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన కమర్షియల్‌ కంట్రోల్‌, కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ విభాగం బుధవారం షిప్పింగ్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది.

ఈ సందర్భంగా విభాగం డైరెక్టర్‌ ఫైసల్‌ అల్‌ అన్సారీ మాట్లాడుతూ.. ప్రాంతీయ పరిస్థితుల కారణంగా రవాణా, షిప్పింగ్‌, బీమా, లాజిస్టిక్స్‌ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. దీంతో కువైట్‌కు వస్తువులను సరఫరా చేసే మొత్తం వ్యయం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు.  కంటైనర్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయని షిప్పింగ్‌ కంపెనీలు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువచ్చాయి. ఈ ప్రభావం వస్తువులు, ఉత్పత్తుల ధరలపై పడే అవకాశం ఉందని తెలిపాయి.

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ షిప్పింగ్‌ మార్గాలు, నౌకాశ్రయాలను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. అవసరమైన సందర్భాల్లో వివిధ గల్ఫ్‌ దేశాల ద్వారా కంటైనర్లను సేకరించడం, స్వీకరించడం వంటి మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం ద్వారా సరుకుల రవాణాలో జాప్యాన్ని, అదనపు షిప్పింగ్‌ ఖర్చులను తగ్గించవచ్చని అల్‌ అన్సారీ తెలిపారు. అదే సమయంలో కువైట్‌కు వస్తువుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

పెరిగిన షిప్పింగ్‌ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన పరిష్కార మార్గాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం, వస్తువుల ధరల్లో స్థిరత్వాన్ని కొనసాగించడం, స్థానిక మార్కెట్‌లో సరుకుల లభ్యతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com