తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి

- August 15, 2026 , by Maagulf
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే, భక్తులు తిరుమల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను ముందుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. దర్శన సమయంలో సంయమనం పాటిస్తూ, టీటీడీ సిబ్బందికి సహకరించాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు.

వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరాయి. ప్రస్తుతం దర్శన టికెట్లు, టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.

ఆగస్టు 14వ తేదీన మొత్తం 73,699 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 39,884 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, స్వామివారి హుండీ ద్వారా రూ. 4.03 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా, టీటీడీ మొత్తం 4.31 లక్షల లడ్డూలను విక్రయించగా, 2.41 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించింది.

నిరంతరాయంగా అన్నప్రసాదం, వైద్య సేవలు

భారీ రద్దీ ఉన్నప్పటికీ, భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలు వంటి సౌకర్యాలను టీటీడీ నిరంతరాయంగా అందిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే తిరుమల అశ్విని ఆసుపత్రిలో 3,559 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com