మస్కట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 15, 2026
మస్కట్: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒమన్ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వెయ్యి మందికి పైగా భారతీయ ప్రవాసులు కార్యక్రమానికి హాజరై దేశభక్తిని చాటారు.
ఇండియన్ స్కూల్ అల్ మాబెలా విద్యార్థులు ఆలపించిన ‘వందే మాతరం’తో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఒమన్‌లో భారత రాయబారి ప్రశాంత్ పిసే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ‘సూర్య పథ్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకాన్ని డిజిటల్ రిలే ద్వారా ప్రదర్శించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం రాయబారి ప్రశాంత్ పిసే సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను వివరించారు. దేశ ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలను ప్రస్తావించారు.
వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ సమాజాన్ని అలరించాయి. వివిధ రంగాల్లో భారతీయుల ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒమన్‌లోని భారతీయ కార్మికులు అందిస్తున్న విలువైన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఇండియన్ కమ్యూనిటీ భారత్-ఒమన్ సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా రాయబార కార్యాలయం పలు కార్యక్రమాలు నిర్వహించింది. పెయింటింగ్ పోటీ, క్విజ్ పోటీ, ‘భారత్ కో జానియే’ (BKJ) క్విజ్, ‘ఇండియా త్రూ మై లెన్స్’ ఫొటోగ్రఫీ పోటీ, ఫడ్ పెయింటింగ్ వర్క్‌షాప్, ‘మై ఇండియా, మై స్టోరీ’ కార్యక్రమాలను చేపట్టింది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యస్ఫూర్తితో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
పోటీల్లో విజేతలు, ప్రతిభ కనబరిచిన వారిని రాయబారి సత్కరించారు. సైన్స్ ఇండియా ఫోరమ్‌తో అనుబంధం ఉన్న విద్యార్థులతో పాటు ఒమన్‌లోని భారతీయ పాఠశాలల్లో విద్యా, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందజేశారు.
‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఒమన్‌లోని భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







