కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 15, 2026
కువైట్ సిటీ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 2,000 మందికి పైగా భారతీయులు, ప్రముఖులు, భారత్ మిత్రులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కువైట్‌లో భారత రాయబారి పరమితా త్రిపాఠి స్వాతంత్ర్య సమరయోధుల స్మారక శిలాఫలకం, మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ గీతానికి ముందు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ‘వందే మాతరం’ను సామూహికంగా ఆలపించారు. రాయబారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం ‘జనగణమన’ ఆలపించారు.
ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని రాయబారి చదివి వినిపించారు. సమ్మిళిత అభివృద్ధి, పురోగతితో పాటు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన దిశగా దేశం సాధిస్తున్న ప్రగతి, భవిష్యత్ ఆశయాలను ప్రసంగంలో ప్రస్తావించారు.
భారత్-కువైట్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సన్నిహిత సంబంధాలను రాయబారి పరమితా త్రిపాఠి ప్రస్తావించారు. పరస్పర గౌరవం, స్నేహభావం, ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఇరు దేశాల బంధానికి పునాదిగా ఉన్నాయని తెలిపారు. కువైట్‌లోని భారతీయ సమాజం అందిస్తున్న విలువైన సేవలను ఆమె ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇండియా@80’ వేడుకల్లో భాగంగా రాయబార కార్యాలయం ‘సూర్య పథ్ తిరంగా’ గ్లోబల్ రిలేలోనూ పాల్గొంది. ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాక ప్రయాణాన్ని జాతీయ గర్వం, ఐక్యత, ఉమ్మడి గుర్తింపుకు ప్రతీకగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘సెల్ఫీ విత్ తిరంగా’, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని భారతీయ సమాజాన్ని ప్రోత్సహించారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాయబార కార్యాలయం భారతీయ సమాజం కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ‘మై ఇండియా, మై స్టోరీ’ క్రియేటివ్ క్యాంపెయిన్, ‘ఇండియా త్రూ మై లెన్స్’ ఫొటోగ్రఫీ పోటీ, ‘పెయింట్ యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047’ పెయింటింగ్ పోటీలు ఇందులో ఉన్నాయి.
ఈ పోటీల్లో విజేతలను రాయబారి అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఎంపికైన చిత్రాలు, ఇతర ఎంట్రీలను రాయబార కార్యాలయంలో ప్రదర్శించారు. కువైట్‌లోని భారతీయుల సృజనాత్మకత, దేశభక్తిని ఈ ప్రదర్శనలు ప్రతిబింబించాయి. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ‘భారత్ కో జానియే’ (BKJ) క్విజ్ విజేతలను కూడా రాయబారి సత్కరించారు.
చివరగా రాయబార కార్యాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘స్వచ్ఛతా హి సేవ’ స్ఫూర్తిని చాటుతూ పరిశుభ్రత, పౌర బాధ్యత, సామూహిక భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







