యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం

- August 16, 2026 , by Maagulf
యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం

అబుదాబి: యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్, అటెస్టేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అర్హత కలిగిన కొన్ని వర్గాల దరఖాస్తుదారులకు వాక్-ఇన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, యూఏఈలో అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న మొత్తం 16 ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల (ICACs)లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్హత కలిగిన దరఖాస్తుదారులకు వాక్-ఇన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ వర్గాలకు వాక్-ఇన్ అవకాశం

ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కింది వర్గాల వారు వాక్-ఇన్ అపాయింట్‌మెంట్ పొందేందుకు అర్హులు:

  • తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు
  • నవజాత శిశువుల పాస్‌పోర్ట్ కేసులు
  • ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (EC) కోసం దరఖాస్తుదారులు
  • 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు
  • ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు (People of Determination)

ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌కూ అవకాశం

పైన పేర్కొన్న వర్గాలకు చెందిన వారు కావాలనుకుంటే ముందుగానే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది.

ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లతో వచ్చే దరఖాస్తుదారులను వారి నిర్ణయించిన అపాయింట్‌మెంట్ సమయానికి అనుగుణంగా సేవలు అందిస్తారు. అయితే వాక్-ఇన్ దరఖాస్తుదారులకు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్లాట్ల ఆధారంగా సేవలు అందుతాయి.

దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితిని నివారించేందుకు, అర్హత కలిగిన దరఖాస్తుదారులు సాధ్యమైనంత వరకు ముందస్తుగా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

ఈ కొత్త విధానం ద్వారా పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవలు అవసరమైన సీనియర్ సిటిజన్లు, నవజాత శిశువుల కేసులు, అత్యవసర పత్రాల అవసరం ఉన్నవారు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com