ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4.35 లక్షలకు పైగా కువైటీలు..!!

- August 17, 2026 , by Maagulf
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4.35 లక్షలకు పైగా కువైటీలు..!!

కువైట్ : కువైట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కువైట్ పౌరుల సంఖ్య 4.35 లక్షలు దాటింది. 2026 తొలి త్రైమాసికం ముగిసే నాటికి కువైట్ పౌరుల సగటు నెలవారీ వేతనం 1,592 కువైట్ దినార్లు (KD)గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 1,567 దినార్లుగా ఉంది. సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో గణాంకాల ఆధారంగా అల్-షాల్ ఎకనామిక్ రిపోర్ట్ ఈ వివరాలను వెల్లడించింది. గణాంకాల ప్రకారం, 3,62,100 మంది కువైట్ పౌరులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. ఇది మొత్తం కువైట్ ఉద్యోగుల్లో సుమారు 83.1 శాతం. మరో 73,500 మంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తుండగా, వారి వాటా 16.9 శాతంగా ఉంది. 2025 తొలి త్రైమాసికంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో కువైట్ ఉద్యోగుల సంఖ్య 4 శాతం తగ్గింది. గత ఏడాది 3,77,200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3,62,100కి చేరింది. అయితే ప్రైవేట్ రంగంలో కువైట్ ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు.

మహిళలతో పోలిస్తే పురుషుల వేతనాలు అధికం

ప్రభుత్వ రంగంలో కువైట్ పురుషులు, మహిళల సగటు నెలవారీ వేతనం కలిపి సుమారు 1,625 దినార్లుగా ఉంది. రెండు రంగాలను కలిపి చూస్తే సగటు వేతనం 1,592 దినార్లుగా నమోదైంది. ప్రైవేట్ రంగంలో కువైట్ పురుషుల సగటు నెలవారీ వేతనం 1,681 దినార్లు కాగా, మహిళల సగటు వేతనం 1,140 దినార్లుగా ఉంది. మరోవైపు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాసుల సగటు నెలవారీ వేతనం సుమారు 352 దినార్లుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.  

గృహ కార్మికులను మినహాయిస్తే కువైట్ మొత్తం కార్మిక జనాభా 2026 తొలి త్రైమాసికం ముగిసే నాటికి సుమారు 2.281 మిలియన్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఉన్న 2.212 మిలియన్లతో పోలిస్తే ఇది 3.1 శాతం పెరిగింది. గృహ కార్మికులు, కుటుంబ రంగంలో పనిచేస్తున్న వారిని కూడా కలిపితే దేశంలోని మొత్తం వర్క్‌ఫోర్స్ సుమారు 3.065 మిలియన్లకు చేరుకుంది. కువైట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 52.5 శాతం మంది యూనివర్సిటీ డిగ్రీలు కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. మరో 5.2 శాతం మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ అర్హతలు, 12.8 శాతం మంది పోస్ట్‌ సెకండరీ నాన్-యూనివర్సిటీ అర్హతలు కలిగి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com