అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 18, 2026 , by Maagulf
అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

డాలస్, టెక్సస్: డాలస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద “హర్ ఘరంగ్ తిరంగా” అనే నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముందుగా సంగీత గురు సమీరా శ్రీపాద దర్శకత్వంలో వారి శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. 

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అనేకమంది అమరవీరులకు మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభభాయి పటేల్, నేతాజీ, వీర సావర్కార్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలు చేసిన త్యాగాలు మరువలేనివి అంటూ ప్రవాస భారతీయలగా అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

“ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ “రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్ ల మధ్య ధృడమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, ఈ రోజు భారత జాతీయగీతంతో పాటు, అమెరికా జాతీయగీతం కూడా ఆలపించడం సబబుగా ఉందంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.”   

ప్రత్యేకఅతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “ప్రవాస భారతీయలు మాతృభూమికి వేల మైళ్ళ దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరదేశంలో విస్తరిస్తూ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. భారతదేశ విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వారికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. గత 79 సంవత్సరాలలో భారతదేశంలో అక్షరాస్యత 12 శాతంనుండి 81 శాతానికి పెరిగిందని, ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన దేశం ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దారులలో ఒకటిగా మారిందని, విశ్వవిద్యాలయాల సంఖ్య 20 నుంచి 1, 200కు పైగా పెరిగిందని, విమానాశ్రయాల సంఖ్య 12 నుంచి 166 కు పెరిగిందని, ఫార్మసీ రంగంలో ఎంతో ప్రగతి సాధించి కోవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు సైతం కోవిడ్ టీకాలను అందించే స్థాయికి చేరామని అన్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు అని మరో వైపు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మెరుగైన వైద్య సేవల కొరత, అవినీతి, నల్లధనం లాంటి సమస్యలతో దేశం సతమతమవుతుందని అన్నారు. భారతదేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఎవరికి తోచిన విధంగా వారు వేర్వేరు రంగాలలో సహకారం అందించాలని కోరారు.”    

ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక పద్యాన్ని శ్రావ్యంగా గానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికి 80వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ వేడుకలలో భారతదేశ రక్షణలో సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రాలను, అలాగే 8 సంవత్సరాలలోపు పిల్లలకు కొలంబియా దేశంలో నిర్వహించిన చెస్ పోటీలలో అమెరికా దేశంనుండి పాల్గొని పాన్ అమెరికన్ చాంపియన్ గా నిల్చి, సువర్ణ పతకం సాధించిన సరయు తలపనేని ని ఇర్వింగ్ మేయర్ అల్ జపంటా, డా. ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు. 
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో ఛైర్మన్ తాయబ్ కుండావాలా తన వందన సమర్పణలో ఈ కార్యక్రమం విజయవంతంగావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.

బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపుతో సహా ఎం.వి.ఎల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. కె. అరవిందరావు, వందలాది ప్రవాస భారతీయులు ఈ స్వాతంత్రదినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “ఇండియా టుడే” రెస్టారెంట్ వారు అందరికీ రుచికరమైన అల్పాహారం అందజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com