కువైట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!

- August 19, 2026 , by Maagulf
కువైట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!

కువైట్: కువైట్ రోడ్లపై ప్రమాదకరంగా ఓవర్‌టేకింగ్ చేసే వాహనదారులపై ట్రాఫిక్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఓవర్‌టేకింగ్ నిబంధనలు, షరతులను ఉల్లంఘించిన వారిపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ అవేర్‌నెస్ విభాగం డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఈసా తెలిపిన వివరాల ప్రకారం.. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ రషీద్ అల్-హజ్రీ పర్యవేక్షణలో ఈ ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

సెక్యూరిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం పెట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలను 30 రోజుల పాటు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఇంపౌండ్ యార్డుకు తరలించారు.ప్రమాదకరంగా ఓవర్‌టేకింగ్ చేయడం రహదారిపై ప్రయాణించే ఇతరులకు తీవ్ర ముప్పు కలిగించడంతో పాటు ట్రాఫిక్ గందరగోళానికి కారణమవుతుందని అల్-ఈసా హెచ్చరించారు.

120 ఉల్లంఘనలు.. 115 వాహనాలు సీజ్

ఈ ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీల్లో మొత్తం 120 ఓవర్‌టేకింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో 115 ప్రత్యక్ష ఉల్లంఘనలు, 5 పరోక్ష ఉల్లంఘనలు ఉన్నాయి. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన 115 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రతను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కువైట్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడానికి ఇలాంటి తనిఖీలు, అమలు చర్యలు నిరంతరం కొనసాగుతాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ స్పష్టం చేసింది. ప్రమాదకర డ్రైవింగ్‌ను అరికట్టి, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com