కువైట్‌లో ఫ్లాషింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ఢీకొనే ప్రమాదాలకు చెక్..!!

- August 20, 2026 , by Maagulf
కువైట్‌లో ఫ్లాషింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ఢీకొనే ప్రమాదాలకు చెక్..!!

కువైట్: రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించే చర్యల్లో భాగంగా కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలక్ట్రానిక్ ఫ్లాషింగ్ సిస్టమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది.  రోడ్డపై  ప్రయాణించే వాహనదారుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అధికారి మేజర్ ఇంజినీర్ మహమ్మద్ అల్-ఘనెమ్ తెలిపారు. సిగ్నల్ మారడానికి ముందుగానే డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఈ ఎలక్ట్రానిక్ హెచ్చరిక వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు.

వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాలు తగ్గింపు

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదాలకు కారణాలను అధ్యయనం చేసి, వాటిని నివారించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మొదట కొన్ని ప్రధాన సర్కిళ్లలో ఈ వ్యవస్థను ట్రయల్ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. పరిశీలనలో వెనుక నుంచి వాహనాలు ఢీకొనే ప్రమాదాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. సిగ్నల్ వద్ద వాహనాలు ఆపి ఉంచిన సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించే ఉల్లంఘనలు కూడా తగ్గినట్లు అధికారులు తెలిపారు. ట్రయల్స్ విజయవంతం కావడంతో ప్రస్తుతం కువైట్‌లోని చాలా ట్రాఫిక్ సర్కిళ్లకు ఈ వ్యవస్థను విస్తరించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

ఐదుసార్లు ఫ్లాష్.. ముందస్తు హెచ్చరిక

కొత్త వ్యవస్థలో ట్రాఫిక్ సిగ్నల్ వరుసగా ఐదుసార్లు ఫ్లాష్ అవుతుంది. రెడ్ సిగ్నల్ వైపు వస్తున్న డ్రైవర్లకు ముందుగానే ఆగేందుకు హెచ్చరిక అందుతుంది. గ్రీన్ సిగ్నల్ ఎదురుగా ఉన్న వాహనదారులకు మాత్రం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందని ఈ వ్యవస్థ సూచిస్తుంది. అయితే ఫ్లాషింగ్ హెచ్చరికను దాటి వెళ్లి, ఆ తర్వాత సిగ్నల్ రెడ్ గా మారినప్పటికీ వాహనాన్ని ముందుకు నడిపితే రెడ్ లైట్ ఉల్లంఘనగా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాలు లేదా ట్రాఫిక్ ఆపరేషన్స్ విభాగం ద్వారా ఉల్లంఘనలను నమోదు చేస్తామని అల్-ఘనెమ్ తెలిపారు.

ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన సర్కిళ్లను ట్రాఫిక్ ఆపరేషన్స్, కంట్రోల్ విభాగాలు 24 గంటలూ పర్యవేక్షిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. వాహనదారులు, ఇతర వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అల్-ఘనెమ్ కోరారు. అకస్మాత్తుగా వాహనాలు ఆగడం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు, పాదచారుల ప్రాణాలను రక్షించడమే ఈ ఎలక్ట్రానిక్ ఫ్లాషింగ్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ రోడ్డు భద్రతను మరింత పెంచేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com