యూఏఈలో ఈజిప్టు కార్మికుల తొలగింపుల వార్తలు అవాస్తవం..!!
- August 21, 2026
షార్జా: యూఏఈలో ఈజిప్టు కార్మికులను భారీ సంఖ్యలో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను ఈజిప్టు సీనియర్ అధికారి ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈజిప్టు విదేశాంగ శాఖ కాన్సులర్ వ్యవహారాల సహాయ మంత్రి హద్దాద్ అల్ గోహరీ స్పష్టం చేశారు. అబుదాబిలోని ఈజిప్టు రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని ఈజిప్టు కాన్సులేట్ కూడా ఈజిప్టు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా వీసాలు రద్దు చేయడం వంటి ఘటనలను గుర్తించలేదని తెలిపారు.
వీసాలు సాధారణంగానే జారీ అవుతున్నాయని, యూఏఈలో పెట్టుబడులు కలిగి ఉన్న అనేక ఈజిప్టు కంపెనీలు తమ ఉద్యోగులు, కార్మికుల కోసం ప్రత్యేకంగా వీసాలు పొందుతున్నాయి అని అల్ గోహరీ పేర్కొన్నారు.యూఏఈలో కొందరి రెసిడెన్సీ వీసాలు రద్దు కావడం లేదా ఉద్యోగాలు కోల్పోవడం వంటి వ్యక్తిగత కేసులను ఈజిప్టు అధికారులు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, అయితే ఎక్కువ సందర్భాల్లో వారు యూఏఈ రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. అదేవిధంగా విజిట్ వీసాపై యూఏఈకి వచ్చి ఉద్యోగం పొందలేకపోయిన కొందరు ఈజిప్టుకు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.
యూఏఈ-ఈజిప్టు సంబంధాలు బలంగా ఉన్నాయి
యూఏఈ, ఈజిప్టు మధ్య దౌత్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయని అల్ గోహరీ పేర్కొన్నారు. ఇరు దేశాల కాన్సులర్ కార్యాలయాల మధ్య సమావేశాలు నిర్వహించి, ఈజిప్టు పౌరులకు సంబంధించిన ఇలాంటి కేసులను సమీక్షించనున్నట్లు తెలిపారు. యూఏఈ అధికారులు ఈజిప్టు అధికారులతో సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. యూఏఈలో నివసిస్తున్న లేదా సందర్శిస్తున్న ఈజిప్టు పౌరులకు సంబంధించిన సమస్యలను చర్చించేందుకు ఇరు దేశాలు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యూఏఈతో ఉన్న చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ.. ఈజిప్టు ప్రజలకు యూఏఈపై ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయని అల్ గోహరీ పేర్కొన్నారు.
వర్క్ వీసాల రద్దుపైనా యూఏఈ అధికారి స్పందన
ఇదిలా ఉండగా, యూఏఈ అధ్యక్షుడి సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ కూడా యూఏఈలో లేబర్ రెసిడెన్సీల రద్దు జరుగుతోందన్న వార్తలను ఖండించారు. దేశంపై కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ పరిణామాలను ఎదుర్కోవడం, తదుపరి దశకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. యూఏఈ నుంచి ఇరాన్‌కు ఆర్థిక సదుపాయాలు కల్పిస్తున్నారనే వార్తలను కూడా ఆయన ఖండించారు.
ప్రజలు సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచే తెలుసుకోవాలని యూఏఈ అధికారులు పదేపదే సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో లేదా ఇతర మార్గాల్లో పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే Dh200,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







