యూఏఈలో ఓనం సందడి.. ఒక్క భోజనంలో 30 రకాల వంటకాలు..!

- August 22, 2026 , by Maagulf
యూఏఈలో ఓనం సందడి.. ఒక్క భోజనంలో 30 రకాల వంటకాలు..!

దుబాయ్: కేరళ సంప్రదాయ పండుగ ఓనం సందర్భంగా యూఏఈలోని రెస్టారెంట్లు ప్రత్యేకంగా ఓనం సడ్యా (Onam Sadya) వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే ఈ వారాంతం నుంచే సడ్యాలను అందిస్తుండగా, ఆగస్టు 26 నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఓనం వేడుకల సమయంలో లక్షలాది మందికి వడ్డించేందుకు మరిన్ని రెస్టారెంట్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.

అయితే ఈ ఏడాది ఓనం సడ్యా ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ సంఘర్షణ కారణంగా కూరగాయలు, అరటి ఆకుల ధరలు గణనీయంగా పెరగడంతో రెస్టారెంట్లపై అదనపు భారం పడుతోంది.

తాజాగా కాలికట్ ప్యారగాన్ సంస్థాగత ఆర్డర్‌లో భాగంగా 600 మందికి పైగా సడ్యాను వడ్డించింది. మలబార్ టిఫిన్ హౌస్ కు 800 మంది వరకు కార్పొరేట్ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఆగస్టు 21 శనివారం నుంచే డైనింగ్ కస్టమర్ల కోసం సడ్యాను అందించడం ప్రారంభించిన రెస్టారెంట్లలో షేక్ జాయెద్ రోడ్‌లోని మలబార్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది.

ఈ వారాంతంలోనే సడ్యాను ప్రారంభిస్తున్న కొద్ది రెస్టారెంట్లలో తాము ఒకటైనందున, భారీగా కస్టమర్లు వచ్చే అవకాశం ఉందని రెస్టారెంట్ మేనేజర్ నౌషాద్ తెలిపారు. అయితే చాలా వరకు రెస్టారెంట్లు ఆగస్టు 26 నుంచి సడ్యాను ప్రారంభించి లాంగ్ వీకెండ్ వరకు కొనసాగించనున్నాయి.

ఓనం సడ్యా ప్రత్యేకత ఏమిటంటే..

దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో జరుపుకునే ప్రధాన పంట పండుగ ఓనం. పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సంప్రదాయ ఓనం సడ్యాకు ప్రత్యేక స్థానం ఉంది.

అరటి ఆకుపై వడ్డించే ఈ విందులో 30 రకాల వరకు వంటకాలు ఉండవచ్చు. సాధారణంగా నేలపై కాళ్లు మడుచుకుని కూర్చొని చేతులతో భోజనం చేస్తారు. సడ్యాను సంప్రదాయ పద్ధతిలో నిర్దిష్ట క్రమంలో తింటారు. చివర్లో తీపి, పాలతో తయారు చేసే పాయసంతో భోజనం ముగుస్తుంది. ఈ ఏడాది ఓనం ఆగస్టు 26న జరుపుకోనున్నారు.

 1.5 లక్షల సడ్యాలు.. లక్ష లీటర్ల పాయసం

యూఏఈతో పాటు మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఓనం కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. లులు గ్రూప్ ఈ ఏడాది జీసీసీ వ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఓనం సడ్యాలు, లక్ష లీటర్లకు పైగా పాయసం అందించేందుకు సిద్ధమైంది. ప్రీ-బుకింగ్స్‌కు స్టోర్లలో, ఆన్‌లైన్‌లో భారీ స్పందన లభిస్తోందని లులు గ్రూప్ గ్లోబల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి. నందకుమార్ తెలిపారు.

సడ్యాను సంప్రదాయ రుచిలో అందించేందుకు 100 మందికి పైగా నిపుణులైన చెఫ్‌లు కలిసి పనిచేస్తున్నారు. సద్య నిపుణుడు పళయిడం మోహనన్ నంబూదిరి, ప్రముఖ చెఫ్ సురేష్ పిళ్లై మార్గదర్శకత్వంలో వంటకాల తయారీ జరుగుతోందన్నారు.

భారత్ నుంచి తాజా పదార్థాలను ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా భారీగా దిగుమతి చేస్తున్నారు. సంప్రదాయ రుచిని కాపాడేందుకు 2,500 టన్నులకు పైగా తాజా పదార్థాలను భారత్ నుంచి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

25 రకాల పాయసం

లులు గ్రూప్ నిర్వహిస్తున్న పాయసం ఫెస్టివల్ కూడా ఓనం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆగస్టు 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మామిడి, పనస, నెయ్యి, అడ, గోధుమ తదితర రుచులతో 25కు పైగా రకాల పాయసం అందించనున్నారు. అదనంగా ఓనం కేకులు, పేస్ట్రీలు, చిప్స్, ఐస్‌క్రీమ్‌లు, ఇతర పండుగ ప్రత్యేక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

25 వేల నుంచి 30 వేల సడ్యాలు

ప్యారగాన్ గ్రూప్‌కు చెందిన ఏడు రెస్టారెంట్ శాఖల్లో ఈ ఏడాది 25 వేల నుంచి 30 వేల సడ్యాలు వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రూప్ సీఈఓ సుమేష్ గోవింద్ తెలిపారు. 450 మంది కోసం సడ్యా తయారు చేయడానికి 70 కిలోలకుపైగా బియ్యం అవసరమవుతుందని చెప్పారు. వంటకాల తయారీకి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుండగా, కూరగాయలు కోయడం, ఊరగాయలు తయారు చేయడం వంటి పనులకు మరో రెండు నుంచి మూడు గంటలు పడుతుందని వివరించారు. వీటిలో కొంత భాగాన్ని ముందురోజే సిద్ధం చేస్తారు.

మలబార్ టిఫిన్ హౌస్ హెడ్ చెఫ్ మహమ్మద్ అనీస్ సడ్యా తయారీని ఒక ఆర్కెస్ట్రాతో పోల్చారు. సడ్యా వెనుక ఎంతో శ్రమ, నెమ్మదిగా వంట చేయడం, పక్కా ప్రణాళిక ఉంటుందని ఆయన తెలిపారు.

ఓనం రోజున 4 వేల మందికి సడ్యా

తిరువోణం రోజున ఒక్క కాలికట్ ప్యారగాన్ కరామా శాఖలోనే ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య సుమారు 4 వేల మందికి సడ్యా వడ్డించనున్నారు. సిబ్బందికి విశ్రాంతి కల్పించేందుకు ఆ రోజు రాత్రి రెస్టారెంట్‌ను మూసివేయనున్నారు.

యూఏఈలోని మలయాళీలతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఓనం సడ్యాను ఆస్వాదించేందుకు రెస్టారెంట్లకు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. కొరియన్లు, జపనీయులు, యూరోపియన్లు, అమెరికన్లు కూడా సద్యను ఆసక్తిగా రుచి చూస్తున్నారని చెప్పారు.

అయితే ఈ ఏడాది సద్య నిర్వహణ ఖర్చులు పెరిగినట్లు రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రాంతీయ సంఘర్షణ కారణంగా సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడి తాజా కూరగాయలు, ఇతర అవసరమైన పదార్థాల ధరలు పెరిగాయి.

ముఖ్యంగా అరటి ఆకుల ధరలు 35 నుంచి 40 శాతం వరకు పెరిగినట్లు ప్యారగాన్ గ్రూప్ సీఈఓ సుమేష్ గోవింద్ తెలిపారు. అయినప్పటికీ ఓనం సందర్భంగా సంప్రదాయ సడ్యాను ఆస్వాదించేందుకు యూఏఈలో భారీ సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో రెస్టారెంట్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com