రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- August 25, 2026
అమరావతి: పవన విద్యుత్ రంగంలో భాగంగా అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గంలో ప్రఖ్యాత సుజ్లాన్ సంస్థ రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పనున్న విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం, హులికెర గ్రామం వద్ద ఈ భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ పవన విద్యుత్ ప్రాజెక్టులను రాయదుర్గం, ఉరవకొండ, కల్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు.
న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ప్రారంభం
ఈ కార్యక్రమంలో భాగంగా, సుజ్లాన్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ‘S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్’ను కూడా మంత్రి లోకేశ్ అధికారికంగా ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రాజెక్టుకు సంబంధించిన ఆడియో విజువల్ (ఏవీ) ప్రదర్శనను వీక్షించారు. అంతకుముందు బళ్లారి సమీపంలోని హలకుంది గ్రామంలో ఉన్న సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును మంత్రి సందర్శించి, అక్కడి విండ్ టర్బైన్పై తన సంతకం చేశారు.
ఈ సందర్భంగా సుజ్లాన్ ప్రతినిధులు ప్రాజెక్టు విశేషాలను మంత్రికి వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 1,700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యంతో అతిపెద్ద విండ్ భాగస్వామిగా ఉన్న సుజ్లాన్, తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. 2030 నాటికి రాష్ట్రంలో అదనంగా మరో 5,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. పవన విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని కీలక కేంద్రంగా మార్చేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రముఖుల హాజరు
ఈ కీలక కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు (రాయదుర్గం), అమిలినేని సురేంద్రబాబు (కల్యాణదుర్గం), దగ్గుపాటి వెంకట ప్రసాద్ (అనంతపురం అర్బన్) పాల్గొన్నారు. సుజ్లాన్ గ్రూప్ తరఫున కో-ఫౌండర్, వైస్ ఛైర్మన్ గిరీష్ తంతి, సీఈవో అజయ్ కపూర్, అడ్వైజర్ వి.బి. రావు, ఇతర భాగస్వామ్య సంస్థలైన టాటా పవర్ ఎండీ సంజయ్ బంగా, టోరెంట్ పవర్ డైరెక్టర్ జిగీష్ మెహతా, వారీ ఎనర్జీస్ సీఎండీ హితేష్ దోషి, ఎన్ఆర్ఈడీసీఏపీ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎమ్. కమలాకర బాబు, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







