గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- August 30, 2026
కువైట్ : ఫామ్‌లోని పశువుల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో గల్ఫ్ దేశ పౌరుడి మృతిపై దర్యాప్తు చేపట్టిన కువైట్ పోలీసులు హత్య కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సాల్మి ప్రాంతంలోని ఓ ఫామ్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, అందులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసు ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా కాలిపోయిన స్థితిలో గల్ఫ్ దేశ పౌరుడి మృతదేహం గుర్తించారు.
వాహనంలో రక్తపు మరకలు
దర్యాప్తులో భాగంగా మృతుడి వాహనాన్ని పరిశీలించిన అధికారులు అందులో రక్తపు మరకలను గుర్తించారు. దీంతో అగ్నిప్రమాదానికి ముందే అతడిపై దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.సంఘటనా స్థలంలో మృతుడికి సంబంధించిన దుస్తులు, వ్యక్తిగత వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి సంబంధించిన ఆనవాళ్లను చెరిపివేసి, ఘటనను అగ్నిప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో పోలీసులు ఫామ్‌లోని పశువుల కొట్టం కాపలాదారుడిపై అనుమానం వ్యక్తం చేశారు.
అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఆధారాలపై ప్రశ్నించగా.. మృతుడితో జరిగిన వివాదం కారణంగానే ఈ నేరానికి పాల్పడినట్లు అతడు అంగీకరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మృతుడిపై చెక్క కర్రతో దాడి చేశాడు. అనంతరం అతడిని పశువుల కొట్టంలోని పశుగ్రాసం ఉంచే ప్రాంతానికి తరలించి, హత్యను దాచిపెట్టే ఉద్దేశంతో అక్కడ నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా రక్తపు మరకలను తొలగించేందుకు ప్రయత్నించడంతో పాటు మృతుడికి చెందిన కొన్ని వస్తువులను కూడా తొలగించినట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
తదుపరి చర్యలకు అప్పగింత
కేసుకు సంబంధించి అవసరమైన చట్టపరమైన చర్యలను చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితుడిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. నేరాలకు సంబంధించిన ఘటనల వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం, సమాజ భద్రతకు ముప్పుగా పరిణమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భద్రతా విభాగాలు నిరంతరం పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







