బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!

- August 30, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!

మనామా: బహ్రెయిన్‌లోని రిఫా ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త రహదారిని వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్క్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బులేవార్డ్ రోడ్‌ను ట్రాఫిక్‌కు తెరిచారు. కొత్తగా నిర్మించిన ఈ రహదారి ప్రాంతంలోని రోడ్ నెట్‌వర్క్‌కు అదనపు అనుసంధానంగా పనిచేయనుంది. మొత్తం సుమారు 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న బులేవార్డ్ రోడ్‌లో ఇరువైపులా రెండు చొప్పున లేన్లు ఉన్నాయి. ఇది జల్లాక్ అవెన్యూను షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అవెన్యూతో కలుపుతుంది.
1.3 కిలోమీటర్ల యూ-టర్న్ రోడ్డు
ఈ ప్రాజెక్టులో భాగంగా గతంలో జల్లాక్ అవెన్యూ, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అవెన్యూ కూడలిలో సుమారు 1.3 కిలోమీటర్ల పొడవైన యూ-టర్న్ రోడ్డును కూడా నిర్మించారు. ఈ యూ-టర్న్ ద్వారా వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, సేవా కేంద్రాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది. 
జంక్షన్ వద్ద లేన్ల పెంపు
జల్లాక్ అవెన్యూ నుంచి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అవెన్యూకు కుడివైపు తిరిగే లేన్‌ను కూడా విస్తరించారు. గతంలో ఒక లేన్‌గా ఉన్న ఈ మార్గాన్ని రెండు లేన్లకు పెంచారు. దీంతో రహదారి సామర్థ్యం పెరగడంతో పాటు సర్కిల్ వద్ద వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగనున్నాయి.

పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా..
రిఫా ప్రాంతంలో పట్టణ అభివృద్ధి వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రహదారి ప్రాజెక్టులు కీలకంగా మారుతున్నాయి. విద్యా సంస్థలు, సేవా కేంద్రాలు, ఇతర సదుపాయాలు పెరుగుతున్నందున రహదారులపై వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది.
కొత్త రహదారి, యూ-టర్న్, అదనపు టర్నింగ్ లేన్‌లతో రిఫాలో ట్రాఫిక్ రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com