‘సర్దార్ 2’ స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

- September 01, 2026 , by Maagulf
‘సర్దార్ 2’ స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

‘సర్దార్ 2’ స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సర్దార్ తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్, కాన్ఫ్లిక్ట్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను ప్రజెంట్ చేయడం అద్భుతంగా ఉంది.  

మురుగన్ స్వామికి పరమ భక్తుడైన సర్దార్‌ను జపాన్‌లో జరిగే ఒక సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్ కోసం రిక్రూట్ చేస్తారు. ఒక సాధారణ సీక్రెట్  ఆపరేషన్‌గా మొదలైన మిషన్ ఊహించని పరిస్థితుల్లోకి వెళ్లడంతో సర్దార్‌పై  ప్రభావం పడుతుంది. ఎంతోమంది ప్రాణాలను కాపాడినప్పటికీ అతడిని ఏదో వెంటాడుతూనే ఉంటుంది. అక్కడి నుంచి కథ ప్రస్తుత కాలానికి వస్తుంది. దేశానికి ఎదురయ్యే ఒక తీవ్రమైన ముప్పు సర్దార్, అతని కొడుకు విజయ్‌ను మరో ప్రమాదకరమైన మిషన్‌లోకి తీసుకెళ్తుంది. తండ్రీకొడుకులు కలిసి ఈ ఆపరేషన్‌లోకి దిగిన తర్వాత.. వారి ముందుకు ఒక మిస్టీరియస్ విలన్ వస్తాడు. అతడి అసలు లక్ష్యం ఏమిటనేది మాత్రం ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు.

కార్తీ మరోసారి రెండు విభిన్న పాత్రలతో అదరగొట్టారు. తండ్రి, కొడుకులను లుక్స్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా డిఫరెంట్‌గా చూపించారు. ముఖ్యంగా యంగ్ సర్దార్‌గా కార్తీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆకట్టుకుంటోంది. విజయ్ పాత్రలో మరో డిఫరెంట్ ఎనర్జీ కనిపిస్తోంది. ఎస్.జే. సూర్య విలన్‌గా ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన అనూహ్యమైన బిహేవియర్ కథలో టెన్షన్‌ను మరింత పెంచుతోంది.

మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్, అచ్యుత్ కుమార్, యోగిబాబు పాత్రలకు సంబంధించిన విజువల్స్ ట్రైలర్‌లో ఆసక్తికరంగా ఉన్నాయి.

విజువల్‌గా ‘సర్దార్ 2’ మొదటి భాగం కంటే మరింత భారీగా కనిపిస్తోంది. స్పై, యాక్షన్, మిస్టరీ, ఎమోషనల్ డ్రామాను పీఎస్ మిత్రన్ కథలో మేళవించారు. ముఖ్యంగా ప్రీక్వెల్, సీక్వెల్ అంశాలను ఒకే నెరేషన్‌లో కలపడం ఆసక్తిని పెంచుతోంది.  జపాన్‌లో సర్దార్ చేసిన మిషన్‌కు, ప్రస్తుతం అతని కొడుకు ఎదుర్కొంటున్న ప్రమాదానికి ఉన్న లింక్ ఏమిటన్నది సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు స్లిక్, ఎక్స్‌పాన్సివ్ విజువల్ స్టైల్‌ను తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ లొకేషన్స్‌తో పాటు హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ స్కేల్‌లో చూపించారు. సామ్ సీఎస్ ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌ను మరింత పెంచింది. కీలక సన్నివేశాలకు బీజీఎం మంచి ఇంటెన్సిటీని ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గ్రాండ్‌గా ఉన్నాయి.

మొత్తంగా ‘సర్దార్ 2’ ట్రైలర్ ఈ ఫ్రాంచైజ్‌ను మరింత భారీగా, డార్క్‌గా, అంబిషియస్‌గా  ప్రజెంట్ చేస్తోంది. డ్యూయల్ టైమ్‌లైన్, ఇంటర్నేషనల్ స్పై బ్యాక్‌డ్రాప్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, హై-ఆక్టేన్ యాక్షన్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.  

నటీనటులు: కార్తి, ఎస్.జె. సూర్య
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: పీఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎ. వెంకటేష్
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
డీఓపీ: జార్జ్ సి విలియమ్స్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్ నంబియార్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎ. పాల్ పాండి
పీఆర్ఓ: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com