యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!

- September 03, 2026 , by Maagulf
యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!

దుబాయ్: యూఏఈపై సైబర్ దాడులు భారీగా పెరుగుతున్నాయని యూఏఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి మొహమ్మద్ అల్ కువైతి తెలిపారు. స్మార్ట్ హోమ్ పరికరాలు, సీసీటీవీ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, కార్లలోని డిజిటల్ వ్యవస్థలు కూడా ఇటీవల సైబర్ దాడుల లక్ష్యాలుగా మారుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన సైబర్ దాడుల్లో హ్యాక్ అయిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాలను నేరగాళ్లు కేవలం నష్టం కలిగించడానికే కాకుండా ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కూడా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. సెల్ఫ్ డ్రైవ్ వాహన వ్యవస్థలు, కార్ల డ్యాష్‌బోర్డ్ కెమెరాలు వంటి పరికరాలు కూడా దాడుల మధ్యలోకి లాగబడుతున్నాయని తెలిపారు.

రోజుకు 8 లక్షలకు పైగా సైబర్ దాడులు

ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈపై జరుగుతున్న సైబర్ దాడుల సంఖ్య భారీగా పెరిగిందని అల్ కువైతి తెలిపారు. సాధారణంగా రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నమోదయ్యే సైబర్ దాడులు, ఇటీవల 8 లక్షలకు పైగా పెరిగాయని వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాలు లేదా చర్చలు జరుగుతున్నప్పటికీ సైబర్ యుద్ధం మాత్రం నిరంతరంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

అన్ని దాడుల్లోకి ఏఐ

ప్రస్తుతం దాదాపు ప్రతి రకమైన సైబర్ దాడిలో కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతోందని అల్ కువైతి చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, దుష్ప్రచార ప్రచారాల నుంచి ఫిషింగ్, స్పియర్-ఫిషింగ్, వ్యక్తులు, సంస్థల పేర్లతో నకిలీ గుర్తింపుల ద్వారా జరిగే దాడుల వరకు ఏఐ వినియోగం విస్తరించిందన్నారు. గతంలో ప్రధానంగా ర్యాన్సమ్‌వేర్, డేటా చోరీ వంటి దాడులు ఎక్కువగా ఉండగా, ఇప్పుడు మరింత విధ్వంసకరమైన దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

 ‘వైపర్’ మాల్వేర్

సైబర్ నేరగాళ్లు ఇటీవల ‘వైపర్’ మాల్వేర్ ను ఉపయోగిస్తున్నారని అల్ కువైతి తెలిపారు. ఈ మాల్వేర్ ద్వారా డేటాను దొంగిలించి డబ్బులు డిమాండ్ చేయడం కాకుండా, డేటాను పూర్తిగా తొలగించడం లేదా ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని చెప్పారు. ఇంధనం, విద్యుత్, నీరు, డీశాలినేషన్, ఆరోగ్య రంగాలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలు సైబర్ దాడుల ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలు, సైబర్ యుద్ధం, సైబర్ ఉగ్రవాదం కలిసి కీలక సేవలకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

యూఏఈ సైబర్ మోడల్

యూఏఈ రూపొందించిన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా 25కి పైగా దేశాలు స్వీకరించాయని అల్ కువైతి వెల్లడించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతో సైబర్ ముప్పులను ఎదుర్కొనే యూఏఈ నమూనాకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. యూఏఈ దాదాపు ఏడాదిన్నర క్రితమే పోస్ట్-క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని ప్రారంభించిందని అల్ కువైతి తెలిపారు. అప్పటి నుంచి దేశంలోని కీలక మౌలిక సదుపాయాల్లో 10 నుంచి 15 శాతం వరకు పోస్ట్-క్వాంటమ్ భద్రత కలిగిన వ్యవస్థలకు మార్చినట్లు వెల్లడించారు.

యూఏఈ సైబర్ సెక్యూరిటీ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను రానున్న వారాల్లో నిర్వహించే పరిశ్రమ సదస్సులో వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సమన్వయం పెంచడం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com