ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!

- September 05, 2026 , by Maagulf
ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!

మస్కట్: ఒమన్ జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమంలో మరో కీలక మైలురాయి నమోదైంది. దేశంలో నాలుగో గుండె మార్పిడి ఆపరేషన్  విజయవంతంగా నిర్వహించారు. అదే సమయంలో బ్రెయిల్ డెడ్ అయిన ఒక దాత నుంచి సేకరించిన నాలుగు అవయవాలను మార్పిడి చేసి నలుగురు రోగుల ప్రాణాలను కాపాడినట్లు అధికారుల ఒమానీ సెంటర్ ఫర్ ఆర్గన్ అండ్ టిష్యూ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతమైంది. సంక్లిష్ట అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించడంలో దేశంలోని వైద్య బృందాల సామర్థ్యం పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

ఒమానీ సెంటర్ ఫర్ ఆర్గన్ అండ్ టిష్యూ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డైరెక్టర్ డాక్టర్ నూరీన్ బింట్ యూసుఫ్ అల్ బలూషి.. మాట్లాడుతూ..తక్కువ కాలంలో వరుసగా విజయవంతమైన మార్పిడి ఆపరేషన్ లు జరగడం ద్వారా ఒమన్ అవయవ దానం, మార్పిడి వ్యవస్థ మరింత పరిపక్వమైన, వ్యవస్థీకృత దశకు చేరిందని తెలిపారు. అవయవ దాతలను ముందుగానే గుర్తించడం, బ్రెయిన్ డెడ్ ను కచ్చితంగా నిర్ధారించడం, దాత ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, అవయవాలను భద్రపరచడం, అవయవాల సేకరణ, మార్పిడి బృందాల మధ్య వేగవంతమైన సమన్వయం వంటి అంశాలు ఈ విజయానికి కీలకమని పేర్కొన్నారు.ఈ ప్రక్రియలో ఐసీయూ విభాగాలు, ప్రయోగశాలలు, బ్లడ్ బ్యాంకులు, లాజిస్టిక్స్ బృందాలు, గుండె, కాలేయం, మూత్రపిండాల మార్పిడి నిపుణులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

గుండె మార్పిడి అత్యంత సంక్లిష్టం

నేషనల్ సెంటర్ ఫర్ హార్ట్ మెడిసిన్ అండ్ సర్జరీకి చెందిన కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఖాసిమ్ బిన్ సలేహ్ అల్ అబ్రీ మాట్లాడుతూ..  గుండె మార్పిడి అత్యంత సంక్లిష్టమైన ప్రత్యేక వైద్య ప్రక్రియల్లో ఒకటని చెప్పారు. నాలుగో గుండె మార్పిడి విజయవంతం కావడం ద్వారా ఒమన్ జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభ దశను దాటి, నిరంతర సేవలు అందించే స్థాయికి చేరుకుంటోందని తెలిపారు.

రాయల్ హాస్పిటల్‌లోని నేషనల్ హార్ట్ సెంటర్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అమ్నా బింట్ అల్ బుసైదీ మాట్లాడుతూ..  ప్రతి విజయవంతమైన మార్పిడి దేశీయ వైద్య నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, అత్యాధునిక అవయవ మార్పిడి సేవలను అందించే సామర్థ్యంపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు.

35 అవయవ మార్పిడులు

ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 28 వరకు ఒమన్‌లో మొత్తం 35 అవయవ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.వీటిలో 23 కిడ్నీ మార్పిడులు, 9 లీవర్ మార్పిడులు, 3 గుండె మార్పిడులు, 50 కార్నియా మార్పిడులు జరిగాయి. ఇక కిడ్నీ మార్పిడుల్లో 15 జీవ దాతల నుంచి, 8 బ్రెయిన్ డెడ్ చెందిన దాతల నుంచి అవయవాలు సేకరించారు. కాలేయ మార్పిడుల్లో 6 జీవ దాతల నుంచి, 3 మెదడు మరణం చెందిన దాతల నుంచి జరిగాయి. గుండె మార్పిడులన్నీ బ్రెయిన్ డెడ్ చెందిన దాతల నుంచి సేకరించిన గుండెలతో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అవగాహన అవసరం

అవయవాల అవసరం ఇంకా అందుబాటులో ఉన్న దాతల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ కేసులను వేగంగా గుర్తించి నివేదించడం, అవయవ దాన సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వడం, ఐసీయూ సామర్థ్యాన్ని పెంచడం, ప్రజల్లో అవయవ దానంపై అవగాహన పెంచడం అవసరమని పేర్కొన్నారు. అవయవ దాతగా నమోదు చేసుకునే ప్రతి వ్యక్తి, అలాగే అవయవ దానానికి అంగీకరించే ప్రతి కుటుంబం అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఒమన్ అవయవదాన మరియు మార్పిడి కేంద్రం తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com