ఇరాన్‌ వాదనలను ఖండించిన ఖతార్‌.. యూఎన్ఓకు లేఖలు..!!

- September 05, 2026 , by Maagulf
ఇరాన్‌ వాదనలను ఖండించిన ఖతార్‌.. యూఎన్ఓకు లేఖలు..!!

న్యూయార్క్: తమ భూభాగంపై దాడులకు సంబంధించి ఇరాన్‌ చేస్తున్న సమర్థనలకు ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదని ఖతార్‌ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ చర్యలకు ఇరాన్‌ బాధ్యత నుంచి తప్పించుకోలేదని పేర్కొంది. ఈ మేరకు ఖతార్‌ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, అలాగే ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న ఫ్రాన్స్‌ శాశ్వత ప్రతినిధి జెరోమ్ బొన్నాఫాంట్ కు లేఖలు పంపింది. ఖతార్‌ శాశ్వత ప్రతినిధి షేఖా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఈ లేఖలను అందజేశారు. ఐరాన్‌ ఐక్యరాజ్యసమితి కార్యాలయం ప్రతినిధి పంపిన సమాచారానికి ప్రతిస్పందనగా ఈ లేఖలు పంపినట్లు ఖతార్‌ తెలిపింది.

ఐరాస చార్టర్‌కు విరుద్ధం

2026 ఫిబ్రవరి 28 నుంచి తమ భూభాగంపై ఇరాన్‌ ప్రారంభించిన దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌, అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించాయని ఖతార్‌ పేర్కొంది. ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 2(4)ను ప్రస్తావిస్తూ, ఏ దేశ భౌగోళిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్ర్యంపై బలప్రయోగం లేదా బలప్రయోగ బెదిరింపులను ఈ నిబంధన నిషేధిస్తుందని తెలిపింది.

అలాగే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 (2026) ఇరాన్‌ దాడులను తీవ్రంగా ఖండించిందని, వాటిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా, అంతర్జాతీయ శాంతి, భద్రతలకు తీవ్రమైన ముప్పుగా పేర్కొందని ఖతార్‌ తెలిపింది.1974లో ఐరాస సాధారణ సభ నిర్వచించిన దురాక్రమణ నిబంధనలను ఇరాన్‌ స్వయంగా ప్రస్తావించడం తమ వాదనకు వ్యతిరేకంగా మారుతుందని ఖతార్‌ పేర్కొంది. మరో దేశ భూభాగంపై బాంబు దాడులు చేయడం, ఆయుధాలను ప్రయోగించడం, నౌకాశ్రయాలు లేదా తీరప్రాంతాలను దిగ్బంధించడం వంటి చర్యలు దురాక్రమణ చర్యలుగా నిర్వచించబడినట్లు తెలిపింది. ఈ నిబంధనలు తమ భూభాగంపై జరిగిన ఇరానీ క్షిపణి, డ్రోన్‌ దాడులకు వర్తిస్తాయని ఖతార్‌ పేర్కొంది. హోర్ముజ్‌ జలసంధిని మూసివేయడం, సముద్ర రవాణాకు అంతరాయం కలిగించడం కూడా ఇరాన్‌ చర్యల్లో భాగమని ఆరోపించింది.

ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 కింద ఆత్మరక్షణ హక్కును ఇరాన్‌ ప్రస్తావించడాన్ని ఖతార్‌ తిరస్కరించింది. ఇరాన్‌ సాయుధ దాడుల నుంచి దేశాలు వ్యక్తిగతంగా లేదా సమష్టిగా తమను తాము రక్షించుకునే హక్కు ఉందని భద్రతా మండలి తీర్మానం 2817, ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానం 61/1 కూడా ధృవీకరించాయని ఖతార్‌ పేర్కొంది.

పౌర మౌలిక సదుపాయాలపై దాడులు

మార్చి నుంచి జూలై మధ్య కాలంలో తమ భూభాగం, ప్రాదేశిక జలాలపై జరిగిన ఇరానీ దాడుల గురించి భద్రతా మండలికి వరుస లేఖల ద్వారా ఇప్పటికే సమాచారం ఇచ్చామని ఖతార్‌ గుర్తుచేసింది. ఈ దాడుల్లో ఇంధన సదుపాయాలు, ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు వంటి పౌర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మారినట్లు ఆరోపించింది.

1949 జెనీవా కన్వెన్షన్లు, అదనపు ప్రోటోకాల్-1తో పాటు అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రాథమిక సూత్రాలను ఇరాన్‌ ఉల్లంఘించిందని ఖతార్‌ ఆరోపించింది. పౌరులు, పౌర ఆస్తుల రక్షణ, విచక్షణారహిత దాడుల నిషేధం, దాడుల్లో నిష్పత్తి సూత్రం, పౌర నష్టాలను తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతలను ఉల్లంఘించిందని పేర్కొంది.

ఖతార్‌కే నష్టపరిహారం హక్కు

ఇరాన్‌ చర్యల వల్ల జరిగిన నష్టాలకు అంతర్జాతీయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అవసరమైతే ఖతార్‌కు జరిగిన నష్టాలకు పూర్తి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని లేఖల్లో పేర్కొంది. దాడుల వల్ల జరిగిన నష్టాలను ఇంకా అంచనా వేస్తూ, నమోదు చేస్తున్నామని ఖతార్‌ తెలిపింది. ఈ విషయంలో తమ అన్ని హక్కులను కొనసాగించుకుంటామని స్పష్టం చేసింది. ఖతార్‌ ఇరాన్‌కు పరిహారం చెల్లించాలని టెహ్రాన్‌ చేస్తున్న డిమాండ్‌ను వాస్తవ బాధ్యతలను తారుమారు చేసే ప్రయత్నంగా అభివర్ణించింది.

హోర్ముజ్‌ లో నౌకాయాన స్వేచ్ఛకు పిలుపు

హోర్ముజ్‌ జలసంధి ద్వారా స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని ఇరాన్‌ గౌరవించాలని ఖతార్‌ మరోసారి కోరింది. జలసంధిలో చట్టబద్ధమైన అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం కలిగించడం, వాణిజ్య నౌకలను బెదిరించడం లేదా దాడి చేయడాన్ని సమర్థించేందుకు ఇరాన్‌ చేస్తున్న వాదనలను ఖతార్‌ తిరస్కరించింది. భద్రతా మండలి తీర్మానం 2817 కూడా అంతర్జాతీయ చట్టాల ప్రకారం రవాణా, వాణిజ్య నౌకలకు ఉన్న హక్కులు, స్వేచ్ఛలను స్పష్టంగా ధృవీకరించిందని ఖతార్‌ తెలిపింది.  ఖతార్‌పై ఇరాన్‌ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేవని దోహా పేర్కొంది.  అంతర్జాతీయ చట్టాల సూత్రాలను వక్రీకరించి, భద్రతా మండలి ముందు వాస్తవ పరిస్థితులను తప్పుగా చూపేందుకు టెహ్రాన్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com