ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!

- September 08, 2026 , by Maagulf
ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!

మస్కట్: ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్‌కు కొత్త రుసుములను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జింగ్ ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఛార్జర్ సామర్థ్యం, ఛార్జింగ్ వేగాన్ని బట్టి ఒక్క కిలోవాట్-అవర్‌కు 50 నుంచి 120 బైసా వరకు రుసుము వసూలు చేయనున్నారు.90 kW లేదా అంతకంటే తక్కువ అయితే 50 బైసా/kWh, 91–180 kW మధ్య అయితే 90 బైసా/kWh, 181 kW లేదా అంతకంటే ఎక్కువ: 120 బైసా/kWh గా ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మార్కెట్‌ను క్రమబద్ధీకరించడం, వినియోగదారులకు ధరల్లో పారదర్శకత కల్పించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కొత్త విధానం లక్ష్యమని రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ ఖర్చులు, ఛార్జింగ్ వేగం, స్టేషన్ల వినియోగం, పెట్టుబడి తిరిగి వచ్చే సమయం వంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఈ రుసుములను నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే EV ఛార్జింగ్ ఖర్చు ఇప్పటికీ తక్కువగానే ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు ఆర్థికంగా, పర్యావరణపరంగా మరింత ఆకర్షణీయమైన రవాణా మార్గంగా మారుతాయని తెలిపింది. ప్రస్తుతం ఒమన్‌లో Shell Oman Marketing, First Electric Vehicle Company వంటి సంస్థలు EV ఛార్జింగ్ పాయింట్లను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కొత్త సంస్థలు మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు, సాధ్యాసాధ్యాల అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి.

ఇక EV వినియోగదారుల కోసం ఒమన్ ప్రభుత్వం “Charger App” అనే జాతీయ ఏకీకృత ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఛార్జింగ్ పాయింట్ల లొకేషన్, ఛార్జర్ల సంఖ్య, అందుబాటులో ఉన్నాయా లేదా, ఛార్జర్ రకం, సామర్థ్యం, పని వేళలు, అమల్లో ఉన్న ఛార్జింగ్ రుసుముల వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com