ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- September 08, 2026
హైదరాబాద్: ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ సాంకేతికత శరవేగంగా మారుతున్న తరుణంలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు నిరంతరం పదును పెట్టుకుని ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెలంగాణ గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ మానవీయ విలువలను కాపాడుకోవాలని సూచించారు. జ్ఞానాన్ని లక్ష్యంతో, విజయాన్ని సామాజిక సేవతో అనుసంధానించుకుని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం మంగళవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగింది. భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా. కృష్ణ ఎల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్రీ కొమండూరు శశి కిరణాచారి, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పట్టభద్రులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
1917లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 109 ఏళ్లుగా విద్య, పరిశోధన, దేశ నిర్మాణంలో విశేష సేవలందిస్తోందని గవర్నర్ తెలిపారు. విశ్వవిద్యాలయం సాధించిన విజయాలకంటే విద్యార్థుల నడవడిక, సమాజ సేవ పట్ల వారికున్న నిబద్ధతే అసలైన గుర్తింపని పేర్కొన్నారు. NAAC A+ అక్రిడిటేషన్, జాతీయ ర్యాంకింగ్‌లు, పరిశోధనల విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ సహకారాలు ఓయూ ప్రగతికి నిదర్శనమన్నారు. శ్రేష్ఠత అనేది నిరంతర ప్రక్రియ అని.. పరిశోధన, ఆవిష్కరణలతో భవిష్యత్తును నిర్మిస్తూనే విశ్వవిద్యాలయం తన ఘన చరిత్రను కాపాడుకోవాలని సూచించారు.
దేశం సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ అగ్రశక్తిగా ఎదిగేందుకు వేగంగా అడుగులు వేస్తోందని గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా అన్నారు. నలంద, తక్షశిల వంటి ప్రాచీన జ్ఞాన సంప్రదాయాలతో పాటు జాతీయ విద్యా విధానం-2020 జ్ఞానం, నడవడిక, సామాజిక బాధ్యతకు మార్గనిర్దేశం చేస్తున్నాయని తెలిపారు. ఈ జాతీయ విద్యా విధానంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాలని కోరారు. డిజిటల్ విద్య ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపే పరిశోధనలు చేపట్టడం, నూతన ఆవిష్కరణలతో యువతకు అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
‘‘ఏఐ సమాచారాన్ని అందించగలదు.. కానీ తుది నిర్ణయం మనిషి తన అవగాహన, నైతిక విలువలు, సున్నితత్వం, కరుణ ఆధారంగా తీసుకోవాలి’’ అని గవర్నర్ అన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగార్థులుగా మిగలకుండా ఉపాధి అవకాశాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా, సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో ఓయూ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.
పట్టభద్రులు తమ విజయానికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయుల త్యాగం, నమ్మకం, మార్గదర్శకత్వం కారణమని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘విజయం సాధించండి.. కానీ వినయంగా ఉండండి. పెద్ద కలలు కనండి.. కానీ మీ మూలాలను మరువకండి. సాంకేతికతను స్వీకరించండి.. మానవత్వాన్ని ఎన్నడూ విడిచిపెట్టకండి’’ అని హితవు పలికారు.
యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని గవర్నర్ కోరారు. ‘మాదకద్రవ్యాలకు నో -జీవితానికి ఎస్ ’ అనే ప్రతిజ్ఞను విస్తృత సామాజిక ఉద్యమంగా మార్చడంలో ఓయూ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ‘సహ్యం’ మానసిక సలహా, సంక్షేమ కేంద్రానికి లోక్‌భవన్ నుంచి రూ.40.25 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల త్యాగం మరువొద్దు: డా.కృష్ణ ఎల్లాముఖ్య అతిథి భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా భారత్‌లో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇల్లు, బంగారం, భూములు విక్రయించి మరీ ఎన్నో త్యాగాలు చేస్తున్నారని అన్నారు. వారి త్యాగాలను గుర్తుంచుకుని విద్యార్థులు తమ లక్ష్యాల సాధనకు కష్టపడాలని సూచించారు. ఏఐ కాలంలో నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని, తమకు నచ్చిన రంగంలో ప్యాషన్‌తో పనిచేస్తూ ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడంపై దృష్టి పెట్టాలని కోరారు. సామాజిక మాధ్యమాలు యువతను లక్ష్యం నుంచి పక్కదారి పట్టిస్తున్నాయని.. వాటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం విశ్వవిద్యాలయ ప్రగతి నివేదికను సమర్పించారు. అనంతరం ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్య అతిథి డా.కృష్ణ ఎల్లా, ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం విద్యార్థులకు పిహెచ్‌డీ డిగ్రీలను ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు అందజేశారు.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







