భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- September 08, 2026
రియాద్: భారత్–సౌదీ అరేబియా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కొనియాడారు.
సౌదీ అరేబియాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న కీర్తి వర్ధన్ సింగ్.. సోమవారం రియాద్‌లో భారతీయ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులతో సమావేశమయ్యారు. సౌదీ అరేబియాకు ఆయన చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్–సౌదీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ వ్యాపార వర్గాల పాత్రను మంత్రి ప్రశంసించారు.
“సౌదీ అరేబియాలోని భారతీయ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులతో సుసంపన్నమైన చర్చ జరిగింది. భారత్–సౌదీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో వారు అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని అభినందించాను. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, సాంకేతిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భాగస్వామ్యాలను ప్రోత్సహించే అంశాలపై చర్చించాం” అని కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
భారత రాయబార కార్యాలయ అధికారులతో భేటీ
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతోనూ మంత్రి సమావేశమయ్యారు. దేశ దౌత్యపరమైన లక్ష్యాల సాధనకు అంకితభావంతో పనిచేయాలని వారికి సూచించారు.
అనంతరం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ మొక్కను తన తల్లి జ్ఞాపకార్థం అంకితం చేసినట్లు మంత్రి తెలిపారు. మాతృత్వం పట్ల భారతీయులకున్న గౌరవాన్ని, పచ్చదనం మరియు సుస్థిర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణపై చర్చలు
అంతకుముందు రియాద్‌లో మహాత్మా గాంధీకి కీర్తి వర్ధన్ సింగ్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం సౌదీ అరేబియా పర్యావరణ, జల, వ్యవసాయ శాఖ ఉప మంత్రి మన్సూర్ హిలాల్ అల్ ముషైటీతో సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై ఇరు దేశాల మధ్య సహకారం, ఉమ్మడి ప్రాధాన్యతలపై చర్చించారు.
భారతీయ కార్మికులతో మంత్రి మమేకం
సౌదీ అరేబియాలోని అల్ ఫనార్ కంపెనీ కార్మిక శిబిరాన్ని కూడా కీర్తి వర్ధన్ సింగ్ సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు.
భారతీయ కార్మికులు భారత్–సౌదీ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, ముఖ్యంగా భారతీయ కార్మికుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు.
భారత్–సౌదీ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికతతో పాటు పర్యాటకం, పర్యావరణం వంటి విభిన్న రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు మంత్రి పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







