ఒమన్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- September 10, 2026
మస్కట్: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, స్మగ్లింగ్, నిల్వ, విక్రయం, వ్యక్తిగత వినియోగంపై ఒమన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కొత్త యాంటీ-నార్కోటిక్స్ చట్టం (Royal Decree No. 67/2026)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో కొన్ని తీవ్రమైన కేసులకు మరణశిక్ష, జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలను విధించే నిబంధనలు ఉన్నాయి.
డ్రగ్స్ అక్రమ రవాణాకు భారీ జరిమానా
ట్రాఫికింగ్ ఉద్దేశంతో మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలను దిగుమతి, ఎగుమతి, ఉత్పత్తి లేదా తయారు చేస్తే జైలు శిక్షతో పాటు RO 35,000 నుంచి RO 60,000 వరకు జరిమానా విధిస్తారు. డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసే కేసుల్లో కొన్ని తీవ్ర పరిస్థితులు ఉంటే మరణశిక్ష విధించే అవకాశం ఉంది. నేరాన్ని పదేపదే చేయడం, అధికార హోదా, లైసెన్స్ లేదా చట్టపరమైన రక్షణను దుర్వినియోగం చేయడం, చట్టపరంగా పూర్తి సామర్థ్యం లేని వ్యక్తిని ఉపయోగించడం, అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలతో కలిసి పనిచేయడం వంటి పరిస్థితులను ఇందులో చేర్చారు.
కనీసం 15 ఏళ్ల జైలు
ట్రాఫికింగ్ కోసం డ్రగ్స్‌ను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, అందించడం లేదా పంపిణీ చేయడం వంటి నేరాలకు కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష, RO 10,000 నుంచి RO 25,000 వరకు జరిమానా విధిస్తారు. విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, జైళ్లు, ప్రార్థనా స్థలాలు, శిబిరాలు వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో లేదా వాటి పరిసరాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడితే శిక్ష జీవిత ఖైదు వరకు పెరిగే అవకాశం ఉంది. చట్టపరంగా పూర్తి సామర్థ్యం లేని వ్యక్తికి డ్రగ్స్ అందించినా కఠిన శిక్షలు ఉంటాయి.
వ్యక్తిగత వినియోగానికీ శిక్షలు
వ్యక్తిగత వినియోగం కోసం డ్రగ్స్‌ను కలిగి ఉండటం, కొనుగోలు చేయడం, తయారు చేయడం లేదా సంపాదించడం వంటి చర్యలకు 1 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష, RO 1,000 నుంచి RO 5,000 వరకు జరిమానా విధించే నిబంధన ఉంది.
డ్రగ్స్‌కు బానిసైన వారికి చికిత్స
అయితే డ్రగ్స్‌కు బానిసైన వారికి కొత్త చట్టంలో చికిత్స, పునరావాసానికి కూడా అవకాశం కల్పించారు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కోర్టులు జైలు శిక్షకు బదులుగా వారిని పునరావాస కేంద్రాలు లేదా ప్రత్యేక చికిత్సా కేంద్రాలకు పంపవచ్చు. పునరావాస కేంద్రంలో చేర్పించే వ్యవధి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉండవచ్చు. అలాగే డ్రగ్స్ వినియోగించే వ్యక్తి స్వచ్ఛందంగా చికిత్స కోసం అధికారులను ఆశ్రయించినా, లేదా అర్హత కలిగిన కుటుంబ సభ్యుడి ద్వారా చికిత్సకు పంపించినా, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయకుండా ఉండే నిబంధన కూడా చట్టంలో ఉంది. ఇక అధికారిక గెజిట్‌లో ప్రచురించిన అనంతరం కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- కువైట్‌లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- ఒమన్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్‌వర్క్‌ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!
- శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు







