బహ్రెయిన్‌లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- September 10, 2026
మనామా: బహ్రెయిన్‌లోని ప్రముఖ వాడీ అల్-బుహైర్ ప్రజలకు అందుబాటులోనే ఉందని సదరన్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్ లతీఫ్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీస్ అఫైర్స్ అండ్ అగ్రికల్చర్ మంత్రిత్వ శాఖ లేదా మరే ఇతర అధికార సంస్థ ఈ ప్రాంతాన్ని మూసివేయలేదని తెలిపారు. వాడీకి ప్రజల ప్రవేశంపై ఇటీవల పలు కథనాలు సోషల్ మీడియాలో వైరలవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఫొటోగ్రాఫర్లు కూడా అక్కడికి వెళ్లి ఫొటోలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగానే గత రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి సంఖ్య తగ్గిందని, ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదని తెలిపారు.
2022లో ప్రకృతి రక్షిత ప్రాంతంగా గుర్తింపు
వాడీ అల్-బుహైర్‌లోని కొన్ని రాతి కొండలు, భూభాగాలను 2022లో ప్రకృతి రిజర్వ్‌గా పరిగణించాలని నిర్ణయించారు. ఈ చర్య ప్రధానంగా ఆ ప్రాంతంలో నిర్మాణాలను నియంత్రించేందుకు ఉద్దేశించినదే తప్ప.. ప్రజల ప్రవేశాన్ని అడ్డుకోవడానికి కాదని అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రాంతం ఈస్ట్ రిఫ్ఫా, సనద్ మధ్య ఉంది. ఇక్కడ వలస పక్షులతో పాటు స్థానిక పక్షులు కూడా కనిపిస్తాయి. స్టార్క్స్, గల్స్ వంటి పక్షులకు ఈ ప్రాంతంలోని తడి భూములు ఆవాసంగా ఉన్నాయి.
45 మిలియన్ ఏళ్ల నాటి భౌగోళిక ఆనవాళ్లు
వాడీ అల్-బుహైర్ పురాతన సున్నపురాయి నిర్మాణాలు, శిలాజాలకు కూడా ప్రసిద్ధి చెందింది. పర్యావరణ అధ్యయనాల ప్రకారం ఇక్కడి కొన్ని భౌగోళిక నిర్మాణాలు సుమారు 45 మిలియన్ ఏళ్ల నాటివిగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పక్షులకు సురక్షితమైన ఆవాసంగా కొనసాగిస్తూనే.. స్థానికులు నడవడానికి, కొంత సమయం గడపడానికి అనువుగా అభివృద్ధి చేయాలని అబ్దుల్లా కోరుతున్నారు.
వాకింగ్ పాత్‌లు, లైటింగ్, సంప్రదాయ కేఫ్‌లు
వాడీలో వాకింగ్ పాత్‌లు, లైటింగ్, సంప్రదాయ కేఫ్‌లు ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో చెట్ల పెంపకం, గ్రీన్ స్పేస్‌ల అభివృద్ధికి బ్యాంకులు, పెద్ద సంస్థలు ఆర్థికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. వాడీ అల్-బుహైర్ ఈ ప్రాంతానికి ఒక గ్రీన్ లంగ్స్ లా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.
దోమల సమస్య నివారణకు చర్యలు
ప్రాంతంలోని రిటెన్షన్ పాండ్‌కు సమీపంలోని భూగర్భ తీయని నీటి వనరుల నుంచి నీరు చేరుతుంది. నీరు నిలిచిపోకుండా, దుర్వాసన రాకుండా ఏరేటర్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల సమీపంలో నీరు నిలిచి దోమలు పెరిగే పరిస్థితి ఏర్పడకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. వాడీని పచ్చదనంతో ఉంచుతూ, నీటి సమస్యలను పరిష్కరించి, ప్రజలకు నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు అబ్దుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31.. ఎఫ్అండ్బీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
- బహ్రెయిన్‌లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- కువైట్‌లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- ఒమన్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్‌వర్క్‌ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!







