సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!

- September 12, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!

రియాద్: సౌదీ అరేబియాలో కీలకమైన ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ ‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రియాద్, మదీనా ప్రాంతాల్లో పైప్‌లైన్‌పై వరుస దాడులు జరిగిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.గురువారం ఉదయం జరిగిన ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వర్గాలు తెలిపాయి. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించినట్లు పేర్కొన్నాయి.

దాడుల సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. పైప్‌లైన్ భద్రతను నిర్ధారించడంతో పాటు దాని పరిస్థితిని అంచనా వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సంబంధిత ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఆమోదిత భద్రతా విధానాలు, అత్యవసర ప్రణాళికల ప్రకారం చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితిపై తదుపరి వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది.

హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గం

సౌదీ అరేబియాకు ఈ పైప్‌లైన్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా దాదాపు నిలిచిపోవడంతో, సౌదీ ముడి చమురు ఎగుమతులకు ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ప్రధాన మార్గంగా మారింది. అరేబియన్ గల్ఫ్‌లోని టెర్మినళ్ల నుంచి సాధారణంగా సముద్ర మార్గంలో తరలించే సుమారు రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురును సౌదీ అరేబియా ప్రత్యామ్నాయంగా ఈ పైప్‌లైన్ ద్వారా ఎర్ర సముద్ర తీరంలోని యన్బు పోర్ట్‌కు తరలిస్తోంది.

తూర్పు సౌదీ అరేబియాలో ఉత్పత్తి అయ్యే ముడి చమురును హోర్ముజ్ జలసంధిని దాటకుండా ఎర్ర సముద్రంలోని ఎగుమతి కేంద్రాలకు చేర్చే సామర్థ్యం ఈ పైప్‌లైన్‌కు ఉంది. అందుకే తాజా దాడుల నేపథ్యంలో పైప్‌లైన్‌ను మూసివేయడం అంతర్జాతీయ చమురు సరఫరాలపై కూడా దృష్టిని ఆకర్షిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com