బిగ్ టికెట్‌లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!

- September 12, 2026 , by Maagulf
బిగ్ టికెట్‌లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!

రాస్ అల్ ఖైమా: యూఏఈలో నిర్వహించే ప్రముఖ బిగ్ టికెట్ లాటరీలో ఐదుగురు ప్రవాసులకు అదృష్టం వరించింది. భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు విజేతలు కలిసి 5 లక్షల దిర్హామ్‌లు గెలుచుకున్నారు. ఒక్కొక్కరికి 1 లక్ష దిర్హామ్‌లు కన్సొలేషన్ ప్రైజ్‌గా లభించింది. విజేతల్లో భారతీయుడు సురేష్ కుమార్ ప్రత్యేకంగా నిలిచారు. పంజాబ్‌కు చెందిన 39 ఏళ్ల సురేష్ కుమార్ గత 19 ఏళ్లుగా రాస్ అల్ ఖైమాలో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం మాత్రం భారత్‌లోనే ఉంటోంది.

సోషల్ మీడియా ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకున్న సురేష్ కుమార్ 2019 నుంచి లాటరీలో పాల్గొంటున్నారు. గతంలో స్నేహితులతో కలిసి గ్రూప్‌గా టికెట్లు కొనుగోలు చేసిన ఆయన.. సిరీస్ 290లో మాత్రం తొలిసారి తన పేరుతో సొంతంగా టికెట్ కొనుగోలు చేశారు. అదృష్టవశాత్తూ ఆయన ఎంపిక చేసుకున్న టికెట్ నంబర్ 250439 బహుమతిని గెలుచుకుంది.

“విజేతగా ఎంపికయ్యానని ఫోన్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో ఏళ్లుగా పాల్గొంటున్నాను. ముఖ్యంగా నేను సొంతంగా కొనుగోలు చేసిన టికెట్‌కు బహుమతి రావడం మరింత ఆనందంగా ఉంది.” అని సురేష్ తెలిపారు. బహుమతి డబ్బును ఎలా ఉపయోగించాలనే విషయంపై సురేష్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రైజ్ మనీ చేతికి వచ్చిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

మరో ముగ్గురు భారతీయులు

ముల్లపల్లి ప్రవీణ్ బాబు కూడా ఈ ఐదుగురు విజేతల్లో ఉన్నారు. ఆయన భారత్‌కు చెందినవారు కాగా, ప్రస్తుతం యూఏఈలో నివసిస్తున్నారు. ఆయన టికెట్ నంబర్ 303871 బహుమతిని గెలుచుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ రఫీకుల్ ఇస్లాం అహ్మద్ మీహ్ తలుక్దార్ కూడా విజేతల్లో ఉన్నారు. 53 ఏళ్ల ఆయన గత 17 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. సాధారణంగా స్నేహితుల గ్రూప్‌తో కలిసి బిగ్ టికెట్‌లో పాల్గొనే ఆయన.. ఈసారి గ్రూప్ టికెట్‌కు బహుమతి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. “కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడి పనిచేస్తున్న సమయంలో ఇలాంటి విజయం ఎంతో ప్రత్యేకం. మొదట నా కుటుంబమే గుర్తుకు వచ్చింది. ఈ వార్త వింటే వారు ఎంత సంతోషిస్తారో అనిపించింది,” అని రఫీకుల్ తెలిపారు.

సొంతంగా కొనుగోలు చేసిన తొలి టికెట్‌కే బహుమతి

గుజరాత్‌కు చెందిన సందీప్ కుమార్ కూడా రూ.20 లక్షల సమానమైన 1 లక్ష దిర్హామ్‌ల బహుమతిని అందుకున్నారు. మధ్యప్రాచ్యంలో 13 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఆయన గత మూడేళ్లుగా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నారు. సాధారణంగా ఆరుగురు స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేసే సందీప్.. సిరీస్ 290లో మాత్రం తొలిసారి సొంతంగా టికెట్ కొనుగోలు చేశారు. అదే టికెట్‌కు బహుమతి రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన నగదులో ఎక్కువ భాగాన్ని సేవింగ్స్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు సందీప్ తెలిపారు.
ఇదిలా ఉండగా, బిగ్ టికెట్‌లో సెప్టెంబర్ నెలకు మరిన్ని భారీ బహుమతులు సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 3న జరిగే లైవ్ డ్రాలో ఒక అదృష్టవంతుడికి 2 కోట్ల దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ దక్కనుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com