మక్కా టార్గెట్ గా హౌతీ డ్రోన్‌.. కూల్చివేసిన సౌదీ..!!

- September 16, 2026 , by Maagulf
మక్కా టార్గెట్ గా హౌతీ డ్రోన్‌.. కూల్చివేసిన సౌదీ..!!

మక్కా: పవిత్ర నగరమైన మక్కా వైపు వస్తున్న హౌతీ డ్రోన్‌ను సౌదీ అరేబియా వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయి. సెప్టెంబర్ 15 సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు యెమెన్‌లో సంకీర్ణ దళాలు వెల్లడించాయి.

సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ టుర్కీ అల్-మాలికీ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6:50 గంటలకు మక్కాకు దక్షిణంగా డ్రోన్‌ను రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ గుర్తించి అడ్డుకున్నాయి. డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే దానిని ధ్వంసం చేసినట్లు తెలిపారు.

మక్కాను లక్ష్యంగా చేసుకునేందుకు హౌతీలు ప్రయత్నించడం ఇది రెండోసారి అని అల్-మాలికీ పేర్కొన్నారు. గతంలో జూలై 27, 2017న కూడా మక్కా వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా యాత్రికులు, పౌరులు, నివాసితుల భద్రతకు ముప్పు కలిగించడంతో పాటు వారిలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు అల్-మాలికీ ఆరోపించారు.

రెండు పవిత్ర మసీదులు, యాత్రికుల భద్రత తమకు “రెడ్ లైన్” అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో హౌతీల నుంచి ఇలాంటి దాడులను నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో సంకీర్ణ దళాలు వెనుకాడబోవని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com