14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!

- September 17, 2026 , by Maagulf
14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!

దుబాయ్: 2026 మార్చిలో యూఏఈలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా బీమా కంపెనీలపై గణనీయమైన ఆర్థిక భారం పడినప్పటికీ.. దేశంలోని బీమా రంగం 2026 తొలి ఆరు నెలల్లో మంచి వృద్ధిని నమోదు చేసింది. 2026 జనవరి–జూన్ మధ్య యూఏఈలో లిస్టైన 27 బీమా కంపెనీల బీమా ఆదాయం 14 శాతం పెరిగి Dh28 బిలియన్లకు చేరుకుంది. 2025 ఇదే కాలంలో ఈ ఆదాయం Dh24.6 బిలియన్లుగా ఉంది.

బద్రి కన్సల్టెన్సీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. మార్చి 2026లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన బీమా నష్టాల ప్రభావం రెండో త్రైమాసికంలోనూ కంపెనీల ఆర్థిక ఫలితాల్లో కనిపించింది. ప్రారంభ దశలో నష్టాలను గుర్తించిన తర్వాత రీఇన్‌స్టేట్‌మెంట్ ప్రీమియంలు కూడా కంపెనీలపై అదనపు ప్రభావం చూపాయి. అయినప్పటికీ ఈ నష్టాలను బీమా రంగం తట్టుకుని వృద్ధి మార్గంలో కొనసాగింది. సంప్రదాయ బీమా సంస్థలు, తకాఫుల్ సంస్థలు రెండింటిలోనూ ప్రీమియం ఆదాయం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

మార్కెట్‌లోని టాప్-5 బీమా సంస్థలు మొత్తం Dh18.8 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధి కావడం గమనార్హం. మరోవైపు మధ్యతరహా, చిన్న బీమా సంస్థల ఆదాయం 19 శాతం పెరిగి Dh9.2 బిలియన్లకు చేరుకుంది. దీంతో బీమా రంగంలో వృద్ధి కేవలం పెద్ద సంస్థలకే పరిమితం కాకుండా ఇతర కంపెనీలకు కూడా విస్తరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

బీమా సేవల ఫలితాల్లో 13% వృద్ధి

బీమా సేవల ఫలితాలు 13 శాతం పెరిగి Dh1.8 బిలియన్లకు చేరుకున్నాయి. 2025 తొలి ఆరు నెలల్లో ఇవి Dh1.6 బిలియన్లుగా ఉన్నాయి. చిన్న, మధ్యతరహా సంస్థల బీమా సేవల ఫలితాలు ఏకంగా 29 శాతం పెరిగి Dh470 మిలియన్లకు చేరుకున్నాయి. టాప్-5 సంస్థల ఫలితాలు 9 శాతం పెరిగి Dh1.37 బిలియన్లకు చేరాయి. కొన్ని సంస్థల్లో మాత్రమే అండర్‌రైటింగ్ ఒత్తిడి ఎక్కువగా ఉందని, మొత్తం మార్కెట్‌కు ఇది విస్తృత సమస్యగా మారలేదని నివేదిక తెలిపింది.

యూఏఈలో లిస్టైన బీమా కంపెనీల పన్ను ముందు లాభం 13 శాతం పెరిగి Dh2.4 బిలియన్లకు చేరింది. టాప్-5 సంస్థల పన్ను ముందు లాభం 11 శాతం పెరిగి Dh1.8 బిలియన్లకు చేరగా.. మిగిలిన సంస్థల లాభం 20 శాతం పెరిగి Dh665 మిలియన్లకు చేరుకుంది.

బీమా సంస్థల పెట్టుబడి ఆదాయం కూడా 13 శాతం పెరిగి Dh1.4 బిలియన్లకు చేరుకుంది. అయితే అన్ని కంపెనీల్లో ఒకే విధమైన వృద్ధి కనిపించలేదు. టాప్-5 సంస్థల పెట్టుబడి ఆదాయం 26 శాతం పెరగగా, మిగిలిన సంస్థల్లో ఇది 5 శాతం తగ్గింది.
ఇకలిస్టెడ్ బీమా రంగంలో తకాఫుల్ సంస్థల వాటా కేవలం 10 శాతం ఆదాయం ఉన్నప్పటికీ.. వృద్ధి పరంగా ఇవి ముందంజలో ఉన్నాయి. ఇక తకాఫుల్ సంస్థల ఆదాయం 16 శాతం, లాభాలు 51 శాతం పెరిగాయి. సంప్రదాయ బీమా సంస్థల ఆదాయం 14 శాతం, లాభాలు 10 శాతం పెరిగాయి.

2026 మిగిలిన కాలంలో బీమా రంగం మంచి ఆదాయ వృద్ధి, మెరుగైన సాంకేతిక పనితీరు, అనుకూల కంబైన్డ్ రేషియోతో కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని బద్రి కన్సల్టెన్సీ తెలిపింది. ముఖ్యంగా రీఇన్సూరెన్స్ ఖర్చుల పెరుగుదల, వాహనాల మరమ్మతు వ్యయాలపై ద్రవ్యోల్బణ ప్రభావం, భౌగోళిక రాజకీయ పరిణామాలు, మారుతున్న నియంత్రణ నిబంధనలు, సాల్వెన్సీ నిర్వహణ వంటి అంశాలపై బీమా సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com