సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- September 17, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని పోర్టుల్లో కంటైనర్ రవాణా భారీగా పెరిగింది. 2024తో పోలిస్తే 2025లో పోర్టుల ద్వారా జరిగిన ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ కంటైనర్ రవాణా 52.9 శాతం పెరిగి సుమారు 3.89 మిలియన్ కంటైనర్లకు చేరుకుంది. సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2025లో ఔట్‌బౌండ్ కంటైనర్ల సంఖ్య సుమారు 1.94 మిలియన్లు కాగా.. ఇన్‌బౌండ్ కంటైనర్లు 1.95 మిలియన్లకు చేరుకున్నాయి.
341 మిలియన్ టన్నులు దాటిన కార్గో
సౌదీ పోర్టుల ద్వారా ఇన్‌బౌండ్, ఔట్బౌండ్గా నిర్వహించిన మొత్తం కార్గో పరిమాణం 341 మిలియన్ టన్నులు దాటింది. ఔట్‌బౌండ్ కార్గో 227.2 మిలియన్ టన్నులకు చేరుకుని 2024తో పోలిస్తే 2.1 శాతం పెరిగింది. ఇన్‌బౌండ్ కార్గో 5 శాతం పెరిగి 114.3 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2025లో సౌదీ పోర్టుల్లో మొత్తం నిర్వహించిన కార్గో పరిమాణం 298 మిలియన్ టన్నులు దాటింది.
యన్బు పోర్టు ముందంజ
ఔట్‌బౌండ్ కార్గోలో కింగ్ ఫహద్ ఇండస్ట్రియల్ పోర్ట్, యన్బు అత్యధిక వాటాను నమోదు చేసింది. ఈ పోర్టు నుంచి 115.2 మిలియన్ టన్నుల కార్గో నిర్వహించగా.. ఇది మొత్తం ఔట్‌బౌండ్ కార్గోలో 50.7 శాతం. ఇన్‌బౌండ్ కార్గోలో కింగ్ అబ్దులఅజీజ్ పోర్ట్, దమ్మామ్ ముందంజలో నిలిచింది. ఈ పోర్టులో 39.2 మిలియన్ టన్నుల ఇన్‌బౌండ్ కార్గో నమోదైంది. ఇది మొత్తం ఇన్‌బౌండ్ కార్గోలో సుమారు 34.3 శాతం. మొత్తం బరువు పరంగా సౌదీ పోర్టుల్లో నిర్వహించిన కార్గోలో కింగ్ ఫహద్ ఇండస్ట్రియల్ పోర్ట్, యన్బు వాటా 33 శాతంగా ఉంది. అయితే కంటైనర్ సామర్థ్యాన్ని సూచించే TEUల పరంగా జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ అత్యధికంగా 47.3 శాతం వాటాను నమోదు చేసింది.
లిక్విడ్ బల్క్ కార్గో అధికం
సౌదీ పోర్టుల్లో నిర్వహించిన కార్గో రకాల్లో లిక్విడ్ బల్క్ కార్గో అత్యధికంగా ఉంది. దీని పరిమాణం 144 మిలియన్ టన్నులు దాటింది. ట్రాన్స్షిప్మెంట్ కార్గో పరిమాణం కూడా 97 మిలియన్ టన్నులు దాటింది. ఇందులో 84.1 మిలియన్ టన్నుల లోడెడ్ కార్గో, 13.1 మిలియన్ టన్నుల అన్‌లోడెడ్ కార్గో ఉన్నాయి. ట్రాన్స్షిప్మెంట్ కార్యకలాపాల్లో నిర్వహించిన కంటైనర్ల సంఖ్య కూడా 2 మిలియన్ TEUలు దాటింది.
సౌదీ పోర్టులకు 7,848 నౌకలు
2025లో సౌదీ పోర్టులకు మొత్తం 7,848 నౌకలు వచ్చాయి. వాటిలో జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ అత్యధికంగా 2,677 నౌకలను నమోదు చేసింది. తర్వాత జుబైల్ కమర్షియల్ పోర్ట్‌కు 1,256 నౌకలు, దమ్మామ్‌లోని కింగ్ అబ్దులఅజీజ్ పోర్ట్‌కు 1,030 నౌకలు వచ్చాయి.
ప్రయాణికుల రాకపోకల్లోనూ పెరుగుదల
పోర్టుల ద్వారా ప్రయాణికుల రాకపోకలు కూడా పెరిగాయి. 2025లో సుమారు 1.1 మిలియన్ మంది ప్రయాణికులు సౌదీ పోర్టుల ద్వారా రాకపోకలు సాగించారు. ఇది 2024తో పోలిస్తే 20.1 శాతం పెరుగుదల. ప్రయాణికుల రాకపోకల్లో జాజాన్ పోర్ట్ ముందంజలో ఉంది. ఇక్కడ 489,600 మందికి పైగా ప్రయాణికులు నమోదయ్యారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌లో సుమారు 413,800 మంది, NEOM పోర్ట్‌లో 187,000 మందికి పైగా ప్రయాణికులు నమోదయ్యారు.
2025లో సౌదీ పోర్టులకు వచ్చిన క్రూయిజ్ ప్రయాణికుల సంఖ్య 174,500గా ఉంది.
ఇదిలా ఉండగా, అన్లోడ్ చేసిన, లోడ్ చేసిన కార్గో బరువుకు సంబంధించిన మరో గణాంకం ప్రకారం.. 2025లో మొత్తం కార్గో బరువు 210.6 మిలియన్ టన్నులు దాటింది. ఇది 2024తో పోలిస్తే 37 శాతం తగ్గుదల నమోదైంది. ఈ విభాగంలో అన్లోడ్ చేసిన కార్గో 99.3 మిలియన్ టన్నులు, లోడ్ చేసిన కార్గో 111.3 మిలియన్ టన్నులుగా నమోదైందని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







