కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!

- September 18, 2026 , by Maagulf
కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!

కువైట్ : దిగుమతి చేసిన లిక్కర్ ను అక్రమంగా విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రవాస వ్యక్తిని కువైట్ అధికారులు అరెస్ట్ చేశారు. అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ చర్య చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది.  జాబర్ అల్-అహ్మద్ ప్రాంతంలో అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతను తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంట్లో 172 మద్యం బాటిళ్లు
విచారణ సందర్భంగా అనుమానితుడు దిగుమతి చేసిన లిక్కర్ ను విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తన నివాసంలో మద్యాన్ని నిల్వ ఉంచిన ప్రదేశాన్ని అధికారులకు చూపించాడు. అతడి నివాసం నుంచి 172 బాటిళ్ల దిగుమతి మద్యం బాటిల్స్ తోపాటు KD 465.750 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు.  

అక్రమ మద్యం విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారా చట్టబద్ధమైన డబ్బుగా చూపించే ప్రయత్నం చేసినట్లు కూడా అనుమానితుడిపై ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలుదారుల నుంచి డబ్బు స్వీకరించేందుకు పేమెంట్ లింకులను ఉపయోగించి, వచ్చిన మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com