గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!

- September 18, 2026 , by Maagulf
గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!

దుబాయ్: 2026 తొలి అర్ధభాగంలో గల్ఫ్ ప్రాంతంలో నమోదైన మొత్తం సైబర్ దాడుల్లో సుమారు 50 శాతం యూఏఈ, సౌదీ అరేబియాపైనే జరిగినట్లు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ పాజిటివ్ టెక్నాలజీస్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గల్ఫ్ ప్రాంతంలో అత్యధికంగా సైబర్ దాడులకు గురైన దేశంగా యూఏఈ 35 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇరాన్ 17 శాతం, సౌదీ అరేబియా 15 శాతంతో ఉన్నాయి.

తొలి త్రైమాసికంలోనే 96 శాతం దాడులు

2026 తొలి ఆరు నెలల్లో నమోదైన సైబర్ ఘటనల్లో ఏకంగా 96 శాతం జనవరి–మార్చి మధ్యకాలంలోనే చోటుచేసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆ సమయంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో హానికరమైన సైబర్ కార్యకలాపాలు భారీగా పెరగడం వల్లే ఈ ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని వారు పేర్కొన్నారు.

పాజిటివ్ టెక్నాలజీస్ చీఫ్ ఎవాంజెలిస్ట్ ఆఫీసర్ అలెక్సీ లుకాట్స్కీ మాట్లాడుతూ..  ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలపై అనేక దాడులు జరిగాయని తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర మద్దతుతో పనిచేసే సైబర్ దాడిదారుల కార్యకలాపాలు కూడా పెరిగినట్లు వివరించారు. యూఏఈ, సౌదీ అరేబియాల్లో IT, టెలికాం, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన అనేక సంస్థలు ఉండటంతో అవి ఎక్కువగా లక్ష్యంగా మారినట్లు ఆయన పేర్కొన్నారు.

ఏ రంగాలపై ఎక్కువ దాడులు?

గల్ఫ్ ప్రాంతంలో విజయవంతమైన సైబర్ దాడుల్లో ప్రభుత్వ సంస్థలే అత్యధికంగా లక్ష్యంగా మారాయి. మొత్తం దాడుల్లో ప్రభుత్వ రంగంపై 27 శాతం దాడులు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత నిర్దిష్ట రంగానికి పరిమితం కాని దాడులు 23 శాతం, పారిశ్రామిక రంగంపై 17 శాతం దాడులు నమోదయ్యాయి. పారిశ్రామిక రంగంపై జరిగిన దాడుల్లో సగం సౌదీ అరేబియాలోని సంస్థలనే లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రధానంగా మూడు రకాల దాడులు

గత కొన్నేళ్లుగా సైబర్ దాడిదారులు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్టు పాజిటివ్ టెక్నాలజీస్ తెలిపింది.  ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లోని భద్రతా లోపాలను ఉపయోగించుకోవడం, మాల్వేర్ ద్వారా దాడులు చేయడం,   ఈమెయిల్, వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడులతో సాఫ్ట్‌వేర్, సిస్టమ్‌లలోని భద్రతా లోపాలను ఉపయోగించుకోవడమే గల్ఫ్ ప్రాంతంలో ప్రధాన దాడి మార్గంగా నిలిచింది. మొత్తం ఘటనల్లో 38 శాతం దాడులు ఈ విధానంలోనే జరిగినట్లు నివేదిక వెల్లడించింది. మాల్వేర్ ద్వారా జరిగిన దాడులు 31 శాతంతో రెండో స్థానంలో ఉండగా, సోషల్ ఇంజినీరింగ్ దాడులు 27 శాతంగా నమోదయ్యాయి.

ఇక పాత తరానికి చెందిన SCADA (Supervisory Control and Data Acquisition) వ్యవస్థలపై ఆధారపడటం, వాటిలోని లోపాలను ఉపయోగించుకోవడం సులభంగా ఉండటం కూడా కొన్ని ప్రాంతాల్లో సైబర్ దాడులు పెరగడానికి కారణమై ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు. AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మాల్వేర్ ఆధారిత దాడులు మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com