AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- September 18, 2026
మనామా: AI వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అరబ్ దేశాలు మరింత బలమైన భద్రతా చర్యలు, నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారు. AI అప్లికేషన్లు, వాటి కారణంగా చోటుచేసుకునే ఘటనలను పర్యవేక్షించేందుకు అరబ్ దేశాలన్నీ కలిసి ఒక ఉమ్మడి ప్రాంతీయ వేదిక ఏర్పాటు చేయాలని బహ్రెయిన్ సీనియర్ ప్రాసిక్యూటర్ సూచించారు.
బహ్రెయిన్‌లో రెండు రోజుల పాటు జరిగిన “Responsible AI Governance in Arab Countries” ప్రాంతీయ వర్క్‌షాప్ ముగింపు సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ విభాగం అధిపతి జహ్రా మురాద్ ఈ ప్రతిపాదన చేశారు. AI నియంత్రణ, మానవ హక్కులు, ప్రమాదాల నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
సమస్యను ముందే గుర్తించాలి
AI గవర్నెన్స్ విషయంలో సమస్యలు తలెత్తిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించే విధానం అవసరమని జహ్రా మురాద్ అన్నారు. ఇందుకోసం AI అప్లికేషన్లు, వాటికి సంబంధించిన ఘటనలను నిరంతరం పర్యవేక్షించడం, విశ్లేషించడం, వాటి ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా AI కారణంగా చోటుచేసుకున్న ఘటనలు, నష్టాలను నమోదు చేసే AI Incident Databaseను ఆమె ప్రస్తావించారు. విశ్వసనీయమైన డేటా అందుబాటులో ఉంటే ప్రమాదాలకు సంబంధించిన నమూనాలను గుర్తించడం, ఒక దేశం ఎదుర్కొన్న సమస్యల నుంచి ఇతర దేశాలు పాఠాలు నేర్చుకోవడం సాధ్యమవుతుందని వివరించారు.
నేరాలు జరిగితే బాధ్యత ఎవరిపై?
AIని నేరాలకు ఉపయోగించిన సందర్భాల్లో క్రిమినల్, చట్టపరమైన బాధ్యతకు సంబంధించిన అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మురాద్ తెలిపారు. ఇలాంటి కేసుల్లో డిజిటల్ ఆధారాలను పరిశీలించేటప్పుడు వాటి నిజాయితీ, ఘటనతో సంబంధం, చట్టబద్ధత, కోర్టులో ఆధారంగా ఉపయోగించగల విలువ వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు.
బహ్రెయిన్‌లో AI వినియోగం
బహ్రెయిన్‌లో ఇన్ఫర్మేషన్ & ఈ-గవర్నమెంట్ అథారిటీ రూపొందించిన AI యూజ్ పాలసీ, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని మురాద్ ప్రస్తావించారు. AI ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఆధారాలను మరింత క్రమబద్ధంగా నిర్వహించడానికి, విశ్లేషించడానికి, స్పష్టంగా ప్రదర్శించడానికి సహాయపడగలవని తెలిపారు. అయితే ఈ ప్రక్రియలో మానవ పర్యవేక్షణ, చట్టపరమైన రక్షణలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
AIకి తగ్గట్టుగా చట్టాలు
AI సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అరబ్ దేశాలు తమ చట్టాలను కూడా ఎప్పటికప్పుడు నవీకరించాల్సిన అవసరం ఉందని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, అరబ్ నెట్వర్క్ ఫర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఇంజినీర్ అలీ అహ్మద్ అల్ దెరాజీ అన్నారు. AIకి జాతీయ సరిహద్దులు లేకపోవడం వల్ల ఒక్కో దేశం మాత్రమే కాకుండా ప్రాంతీయ స్థాయిలో కూడా సహకారం అవసరమని పేర్కొన్నారు.
న్యాయ సేవల్లో AIతో వేగం
ఫస్ట్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ కౌన్సిలర్ వెయిల్ రషీద్ బుఅల్లే మాట్లాడుతూ.. న్యాయ సేవల్లో AI వినియోగం ద్వారా కేసుల ప్రాసెసింగ్ సమయం, మాన్యువల్ పని, తప్పిదాలను తగ్గించే అవకాశం ఉందన్నారు. అయితే AI వినియోగం సమయంలో ప్రజల హక్కులు, ప్రజా ప్రయోజనాలను కాపాడటం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. వర్క్‌షాప్‌లో అరబ్ దేశాల మధ్య మరింత ప్రాంతీయ సహకారం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు మానవ హక్కులకు ప్రాధాన్యతనిచ్చే ఆచరణాత్మక AI గవర్నెన్స్ విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!
- ఒమన్ – బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!







