కువైట్‌లో ఆర్థిక కోర్టులతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగే అవకాశం..!!

- September 21, 2026 , by Maagulf
కువైట్‌లో ఆర్థిక కోర్టులతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగే అవకాశం..!!

కువైట్: వాణిజ్య, ఆర్థిక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు, డిజిటల్ న్యాయ ప్రక్రియలను ప్రవేశపెట్టే కువైట్ ఆర్థిక కోర్టుల చట్టం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. గత ఆగస్టులో ఆమోదించిన కువైట్ ఎకనామిక్ కోర్ట్స్ లా 2027 అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు, అప్పీల్ కోర్టు, కాసేషన్ కోర్టుల్లో ప్రత్యేక ఆర్థిక సర్క్యూట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రత్యేక సాంకేతిక కార్యాలయం కూడా సహకరించనుంది. వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, తీర్పుల అమలును మెరుగుపరచడం, ఎలక్ట్రానిక్ లిటిగేషన్‌ను విస్తరించడం ఈ చట్టంలోని ప్రధాన లక్ష్యాలు. తద్వారా ఒప్పందాల అమలు మరింత సమర్థవంతంగా జరిగి, కువైట్‌లోని న్యాయ, పెట్టుబడి వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కేసులు కోర్టుకు చేరకముందే అవసరమైన పత్రాలను పరిశీలించి, లోపాలను సరిచేసేందుకు కేస్-ప్రిపరేషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. అలాగే విచారణ, అప్పీల్‌కు సంబంధించిన గడువులను క్రమబద్ధీకరించనుంది. కోర్టులో కేసు దాఖలు చేయకముందే వివాదాలను రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే విధానాన్నీ చట్టం ప్రవేశపెడుతోంది. ఇలాంటి పరిష్కారాల రికార్డులకు అమలు చేయగల న్యాయపత్రాల హోదా కల్పించనున్నారు. ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేసుల దాఖలు, విచారణ, తీర్పుల అమలు వంటి ప్రక్రియలను నిర్వహించేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ఎలక్ట్రానిక్ కేసు ఫైళ్లతో పాటు ప్రచురిత తీర్పులు, న్యాయ సూత్రాలతో కూడిన డేటాబేస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని సంబంధిత ప్రభుత్వ సంస్థలతో ఎలక్ట్రానిక్‌గా అనుసంధానించనున్నారు. 

ఆస్తుల జప్తు ప్రక్రియలను ఆధునీకరించడంతో పాటు ఎలక్ట్రానిక్ వేలం విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ రబాహ్ అల్-రబాహ్ మాట్లాడుతూ.. ఆర్థిక న్యాయ వ్యవస్థను అభివృద్ధి చేయడం వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. వాణిజ్య వివాదాలు ఎక్కువ కాలం కొనసాగితే ప్రాజెక్టులు, ఒప్పందాలు ఆలస్యం కావడంతో పాటు ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.

 రత్యేక ఆర్థిక సర్క్యూట్లు కువైట్‌ను వాణిజ్య, ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేయగలవని ఇన్వెస్ట్‌మెంట్ ఇంటరెస్ట్స్ కంపెనీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కువైట్ ఎకనామిక్ సొసైటీ సెక్రటరీ జనరల్ మహ్మద్ అల్-జువాన్  అన్నారు. ఆధునిక ఆర్థిక సాధనాలు, వాణిజ్య విధానాలు, మోసాలు, ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్ వంటి అంశాల్లో న్యాయమూర్తులకు నిరంతర శిక్షణ అవసరమని సూచించారు. పెట్టుబడిదారులు, కంపెనీల సమయం ఆదా కావడం, నిలిచిపోయిన మూలధనం తిరిగి ఆర్థిక కార్యకలాపాల్లోకి రావడం, కువైట్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించిన ఖర్చు-ప్రమాదాలు తగ్గడం వంటి అంశాల ఆధారంగానే ఈ చట్టం ప్రభావాన్ని అంచనా వేయాలని నిపుణులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com