దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?

- September 27, 2026 , by Maagulf
దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?

దుబాయ్: ఒకే పరిశ్రమలోని మరో కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునే యూఏఈ ఉద్యోగులకు నాన్ కంపీట్ క్లాజ్ (Non-Compete Clause)పై కీలక నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్‌ల్యాండ్‌ దుబాయ్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు యూఏఈ ఎంప్లాయ్ మెంట్ లా (Employment Law) ప్రకారం కొన్ని పరిస్థితుల్లో ఈ నిబంధనను అమలు చేయవచ్చు. ఉద్యోగికి ప్రస్తుత సంస్థకు చెందిన కస్టమర్లు లేదా రహస్య వ్యాపార సమాచారానికి యాక్సెస్ ఉన్నప్పుడు, ఉద్యోగ ఒప్పందంలో నాన్ కంపీట్ క్లాజ్ ను చేర్చేందుకు యజమానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధనలో భౌగోళిక పరిధి, కాలవ్యవధి, ఏ రకమైన పనికి పరిమితి వర్తిస్తుందో స్పష్టంగా పేర్కొనాలి. ఉద్యోగం ముగిసిన తర్వాత నాన్ కంపీట్ వ్యవధి రెండేళ్లకు మించకూడదు.

యజమాని చట్టవిరుద్ధంగా ఉద్యోగం తొలగిస్తే?

ఉద్యోగిని యజమాని చట్ట నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్లయితే, నాన్ కంపీట్ రిస్ట్రిక్షన్ అమలు కాకుండా పోతుందని యూఏఈ ఉద్యోగ చట్టంలోని ఆర్టికల్ 10(2) పేర్కొంటుంది. అలాగే మాజీ ఉద్యోగి నాన్ కంపీట్ నిబంధనను ఉల్లంఘించినట్లు యజమానికి తెలిసిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు సంబంధిత క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

రాతపూర్వకంగా క్లాజ్‌ను తొలగించవచ్చా?

ఉద్యోగి, యజమాని మధ్య రాతపూర్వక ఒప్పందం కుదిరితే ఉద్యోగం ముగిసిన తర్వాత నాన్ కంపీట్ క్లాజ్ ను అమలు చేయకూడదని అంగీకరించవచ్చు. దీనితోపాటు కొన్ని పరిస్థితుల్లో ఉద్యోగికి నాన్ కంపీట్ నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. అవి:

* ఉద్యోగి లేదా కొత్త యజమాని మాజీ యజమానికి గరిష్ఠంగా 3 నెలల జీతానికి సమానమైన పరిహారం చెల్లించడం, అయితే మాజీ యజమాని రాతపూర్వక సమ్మతి అవసరం.

* ఉద్యోగ ఒప్పందం ప్రొబెషన్ పరియడ్ (Probation Period)లోనే ముగిసినట్లయితే మినహాయింపు పొందవచ్చు.

* యూఏఈ ఉద్యోగ మార్కెట్ అవసరాల ప్రకారం మంత్రిత్వ శాఖ నిర్ణయించే కొన్ని ప్రొఫేషన్స్ కేటగిరీలు.

కొత్త కంపెనీలో చేరితే యజమాని ఏం చేయాలి?

ఉద్యోగి తన ప్రస్తుత సంస్థకు పోటీగా ఉన్న కంపెనీలో చేరిన సందర్భంలో, కేవలం నాన్ కంపీట్ క్లాజ్ ఉందనే కారణంతో ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. వివాదం తలెత్తి, అది స్నేహపూర్వకంగా పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఉద్యోగి పోటీ సంస్థలో చేరడం వల్ల తమకు నష్టం జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత యజమానిపైనే ఉంటుంది.

కోర్టులో యజమాని ఉద్యోగి పోటీ సంస్థలో చేరినట్లు, దాని వల్ల తమ వ్యాపారానికి ఆర్థిక నష్టం లేదా ఇతర నష్టం జరిగినట్లు నిరూపిస్తే, కోర్టు నిర్ణయించే మేరకు మాజీ ఉద్యోగి పరిహారం చెల్లించాల్సి రావచ్చని నిపుణులు తెలిపారు.  

గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత ఉద్యోగ ఒప్పందం, ఫ్రీ జోన్/మెయిన్‌ల్యాండ్‌ స్థితి, క్లాజ్‌లోని వివరాలు పరిస్థితిని బట్టి మారవచ్చు. అవసరమైతే యూఏఈలో అర్హత కలిగిన న్యాయ నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com