ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..

- September 27, 2026 , by Maagulf
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..

స్వయంగా పూతరేకులు చేసిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

అతిథులకు భోజనాలు వడ్డించిన మంత్రి దుర్గేష్..ఆంధ్ర వంటకాలు అద్భుతహా అంటూ కొనియాడిన ఇన్ఫ్లుయెన్సర్స్

అరిటాకులో ఆంధ్ర భోజనం వడ్డింపు..ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి బంతి భోజనం చేసిన మంత్రి కందుల దుర్గేష్

ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు..ఏపీ పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం

రాజమహేంద్రవరం: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని  రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి  కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.

రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు చేయడం ఈ కార్యక్రమపు ప్రధాన హైలైట్ గా నిలిచింది. అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అతిథులకు భోజనం వడ్డించి తన ఆప్యాయతను చాటుకున్నారు. అరిటాకులో వడ్డించిన ఘుమఘుమలాడే సాంప్రదాయ ఆంధ్ర వంటకాలను ఇన్ఫ్లుయెన్సర్లకు రుచి చూపించి, మన వంటకాల గొప్పతనాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు భోజనాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఉమ్మడి గోదావరి జిల్లా ప్రసిద్ధ మిఠాయి అయిన పూతరేకులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా తన చేతులతో తయారు చేసి, వారికి వడ్డించడం అందరినీ ఆకట్టుకుంది.రాష్ట్రంలో ప్రాచుర్యానికి నోచుకోని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి దుర్గేష్ సూచించారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి దుర్గేష్, అధికారులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్సాహంగా ఫోటోలు దిగి సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్,టూరిజం ఎండీ  పట్టాన్ శెట్టి రవి సుభాష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్  కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్  రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్  ఆదిత్య శర్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com