మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

- September 27, 2026 , by Maagulf
మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మచిలీపట్నం: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సెప్టెంబర్ 28, సోమవారం ‘మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ వెల్లడించారు.

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రభుత్వం మండల, మున్సిపల్ స్థాయిలకు వికేంద్రీకరించిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులకు సంబంధించిన అర్జీలను సమీపంలోని మండల కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో కూడా సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.

అర్జీలను నమోదు చేసుకోవడంతో పాటు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే http://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ప్రజలు తమ స్పందనను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

మరోవైపు, ఆర్టీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్‌లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com