యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?

- September 29, 2026 , by Maagulf
యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?

దోహా: యువతలో పెరుగుతున్న ప్రారంభ దశ కొలొరెక్టల్ క్యాన్సర్ (Early-Onset Colorectal Cancer - EOCRC) కేసులకు దీర్ఘకాలిక స్వల్ప స్థాయి వాపు (Chronic Low-Grade Inflammation - CLGI) పాత్రపై వెయిల్ కార్నెల్ మెడిసిన్-ఖతార్ (WCM-Q) పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన సమీక్షా కథనం Trends in Cancer అనే ప్రముఖ పరిశోధనా జర్నల్‌లో ప్రచురించారు.

చిన్న వయసులోనే క్యాన్సర్‌ పై పరిశీలన

చిన్న వయసులో ఎదురయ్యే కొన్ని మార్చగలిగే, మార్చలేని ప్రమాద కారకాలు శరీరంలో దీర్ఘకాలిక స్వల్ప స్థాయి వాపును పెంచే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ రకమైన వాపు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, ప్రో-ఇన్‌ఫ్లమేటరీ వాతావరణంలో మార్పులకు దారితీసి, కణితి పెరుగుదల, క్యాన్సర్ అభివృద్ధికి అనుకూల పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందని వివరించారు.

 యువతలో పెరుగుతున్న కేసులు  

WCM-Q సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయోమెడిసిన్ ప్రొఫెసర్, సహ-కరస్పాండింగ్ రచయిత డాక్టర్ డైట్రిచ్ బుసెల్‌బర్గ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యువతలో ప్రారంభ దశ కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడుతున్న అనేక మంది యువ రోగులకు కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండకపోవచ్చని, చాలామంది ఆలస్య దశలోనే వ్యాధి నిర్ధారణ పొందుతున్నారని పేర్కొన్నారు.

అలాగే యువతలో వచ్చే కొలొరెక్టల్ క్యాన్సర్ కొన్ని అంశాల్లో వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్‌కు భిన్నంగా ఉంటుందని తెలిపారు. కేసుల పెరుగుదల, చికిత్స ఫలితాలు, మరణాల దృష్ట్యా వ్యాధిని ముందుగానే గుర్తించడం, నివారించడం, మెరుగైన చికిత్సా విధానాలపై మరింత పరిశోధన అవసరమని చెప్పారు.

ఒసెసిటీ, డయబెటిక్, జీవనశైలి కీలకం

యువతలో కొన్ని ప్రమాద కారకాలు రోగనిరోధక వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీసి దీర్ఘకాలిక స్వల్ప స్థాయి వాపుకు దారితీయవచ్చని పరిశోధకులు తెలిపారు. పర్యావరణ కాలుష్యాలు, విషపదార్థాలకు గురికావడం, అనారోగ్యకర జీవనశైలి, ఒసెసిటీ, డయబెటిక్, పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతినడం వంటి అంశాలు దీనితో సంబంధం కలిగి ఉండవచ్చని వివరించారు.

WCM-Q పరిశోధకుడు, వ్యాస సహ-కరస్పాండింగ్ రచయిత డాక్టర్ సామ్సన్ మాథ్యూస్ శామ్యూల్ ప్రకారం.. దీర్ఘకాలిక స్వల్ప స్థాయి వాపు ప్రారంభ దశ కొలొరెక్టల్ క్యాన్సర్ అభివృద్ధి, పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.

 ముందస్తు గుర్తింపుపై దృష్టి

దీర్ఘకాలిక వాపుకు సంబంధించిన ప్రత్యేక బయోమార్కర్లను గుర్తించడం ద్వారా ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి వ్యాధి నిర్ధారణకు సహాయపడవచ్చని పరిశోధకులు తెలిపారు. అలాగే నిర్దిష్ట మాలిక్యులర్ మార్గాలను లక్ష్యంగా చేసుకునే చికిత్సల ద్వారా వ్యక్తికి అనుగుణమైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాపును తగ్గించే ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, అవసరమైన సందర్భాల్లో లక్ష్యిత యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ చికిత్సలు వ్యాధి ప్రారంభాన్ని ఆలస్యం చేయడం లేదా నివారించడంలో, చికిత్స ఫలితాలను మెరుగుపరచడంలో సహాయపడే అవకాశం ఉందని పరిశోధకులు సూచించారు.

నోట్: ఇవి అధ్యయనంలో పరిశోధకులు సూచించిన అవకాశాలు మాత్రమే.  కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏ ఆహారం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మందు ప్రభావవంతమని నిర్ధారించదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com