బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!

- November 23, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!

మనామా: బహ్రెయిన్‌లోని న్యూ ఇండియన్ స్కూల్ (New Indian School) 36వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. బహ్రెయిన్ కేరళీయ సమాజం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలను రెండు విడతలుగా నిర్వహించారు. తొలుత కేజీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

జూనియర్ విద్యార్థుల కార్యక్రమం ఖురాన్ పఠనం, పాఠశాల ప్రార్థనా గీతం, బహ్రెయిన్ జాతీయ గీతంతో ప్రారంభమైంది. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. గోపీనాథ్ మీనన్ స్వాగత ప్రసంగం చేశారు. చిన్నారులు రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్ విద్యార్థుల కార్యక్రమానికి బహ్రెయిన్‌లో భారత రాయబారి డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్‌పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, జాతీయ భద్రతా కమిటీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ హసన్ ఈద్ బుఖమ్మాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, బాధ్యతాయుతమైన, మానవతా విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలని వారు సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు భారతీయ సంస్కృతి, బహ్రెయిన్ అభివృద్ధి ప్రస్థానం, భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలను ప్రతిబింబిస్తూ సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ఎదుర్కొనే చదువుల ఒత్తిడి, మానసిక సమస్యలను ప్రతిబింబించే ది ఇన్విజిబుల్ బ్యాక్‌ప్యాక్ అనే మైమ్ ప్రదర్శన ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. పాఠశాల ఐటీ విభాగం రూపొందించిన మెరిట్ అనే లఘు చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విద్యార్థి నాయకులు వార్షిక నివేదికను సమర్పించగా, విద్యా, కళలు, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎమరాల్డ్ హౌస్ ఉత్తమ హౌస్‌గా నిలిచింది. సఫైర్ హౌస్ మొదటి రన్నరప్‌గా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com