తెలుగు చిత్రాల్లో నటిస్తున్న హీరోలు ఎంతమదో తెలుసా?

- August 24, 2016 , by Maagulf
తెలుగు చిత్రాల్లో నటిస్తున్న హీరోలు ఎంతమదో తెలుసా?

తెలుగు చిత్రాల్లో నటిస్తున్న హీరోలు ఎంతమదో తెలుసా? సరిగ్గా యాభై తొమ్మిది మంది. ఏడాదికి వందకు పైగా చిత్రాల నిర్మాణ జరుగుతుండగా, వాటిలో నటిస్తోంది ఈ యాభై తొమ్మిది మంది హీరోలే. వీరిలో చాలామంది సినీ నేపథ్యం ఉన్నవారు కాగా, మిగతా వారు వెండితెరపై వెలిగిపోవాలని ఆశతో వచ్చి, చిన్నా చితక చిత్రాల్లో నటిస్తున్నవారు.
ఈ యాభై తొమ్మిది మంది హీరోల్లో ఒక్కొక్కరు యావరేజ్‌గా ఏడాదికి రెండు చిత్రాల్లో నటించినా సరే వంద సినిమాలు కచ్చితంగా నిర్మాణ అవుతాయి. ఒకసారి ముఖానికి రంగేసుకున్న వారు మరో వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉండదు. గ్లామర్‌ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు, సక్సెస్‌ వచ్చే వరకు ఇక్కడే ప్రయత్నాలు చేస్తుంటారు.

అందువల్ల తెలుగు సినిమాల నిర్మాణం తగ్గుతుందనేది భ్రమమాత్రమే. పైకి కనిపించే రంగుల ప్రపంచంలో ఎన్నో వైకుంఠపాళిలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎదగాలని ప్రయత్నిస్తారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఒకే ఒక అవకాశం తమ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని గంపెడాశతో ఉంటారు. ఆ ఒక్క అవకాశం ఏదనేది తెలియదు. సక్సెస్‌ ఏ విధంగా వస్తుందనే దానిపై ఇక్కడ రూట్‌ మ్యాపులు ఉండవు. 
సినీరంగం కొందరు గుత్తాధిపత్యంలో ఉందనే అపోహ ఉంది. కానీ సినిమా అనేది పరిశ్రమ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. కేవలం సినిమాపై కొంత అవగాహన, ఆర్థిక వనరులు ఉంటేచాలు. ఎవరైనా సినిమా తీయవచ్చా? అంటే తీయవచ్చనే చెప్పాలి. ఏడాదిలో రిలీజయ్యే సినిమాల్లో యాభై శాతం కొత్త నిర్మాతలు తీస్తున్నవే అనేది అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా వచ్చేవారికి వ్యాపార మెళకులవలు తెలిసే అవకాశం లేదు. దాంతో దళారుల చేతుల్లో పడతారు. దీనివల్ల సినిమా వ్యయం అదుపుతప్పుతుంది. పర్వవసానం బిజినెస్‌కు ఖర్చుకు మధ్య తేడా భారీగా ఉంటుంది. అందువల్ల కొత్త నిర్మాతలు కొంత అవగాహనతో తీస్తే మంచిది.
సినీ నేపథ్యం ఉన్నవారికి భద్రత ఉంటుంది. సినిమాల ఎంపికలో ఛాన్స్‌ ఉంటుంది. ప్రతి అడుగు చూసి వేసే వీలుంటుంది. ఒక సినిమా పోతే మరో సినిమా తీసే పెద్దలుంటారు. ఎలాగైన వారసులని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ పెట్టుబడి పెట్టేవారుంటారు. అందుకే ప్రతి ఏడాది వారసుల సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే సినీ నేపథ్యం లేదా వారసత్వం అనేది పరిచయానికి, ప్రేక్షకుల్లో త్వరగా గుర్తింపురావడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అందరూ అంగీకరిస్తారు. సినిమా అయితే తీయగలరు కానీ దాన్ని సక్సెస్‌ మాత్రం చేయించాలంటే ఇతర హంగులు కావాల్సిందే. అంందుకే పేరున్న దర్శకులు, ప్రసిద్ద సాంకేతిక నిపుణుల అండ వారికి లభిస్తుంది. తీసిన సినిమాను ప్రమోట్‌ చేసుకోవడం చాలా సులువు. ఇక రిలీజ్‌కు థియేటర్ల సమస్యే ఉండదు. ఇటీవలే మూడు చిన్న సినిమాలు (పెళ్లిచూపులు, శ్రీరస్తు శుభమస్తు, మనమంతా) పక్కా ప్లానింగ్‌తో రిలీజ్‌ కావడానికి వాటి వెనుక బడా ప్రొడ్యూసర్లు ఉండడమే కారణం. ఇలాంటి అనేక ప్రతికూలాంశాలు వారసులకు ఉంటాయి. బలవంతంగా హీరోలను రుద్దుతున్నారనేది అపోహ మాత్రమే. ఎందుకంటే సినిమా తీయడం వరకే వారి బాధ్యత, అవి ఆదరణ పొందాలంటే మాత్రం ప్రేక్షకులు కావాలి. ప్రేక్షకులను బలవంతంగా థియేటర్లకు రప్పించలేరు. బావున్న సినిమాను మాత్రమే వారు చూస్తారనేది అందరికీ తెలిసిన వాస్తవమే.
వారసులు హీరోలుగా మారడానికి కారణం ఏమిటీ?. ఇక్కడ పైకి కనిపించని లాభాలు వస్తున్నాయా? అంటే లేదని నిర్మాతలు అంటుంటారు. కేవలం సినిమాల పట్ల యువతకి ఉండే ఆసక్తి వల్లే నటులుగా మారుతున్నారు. పైగా సెలబ్రిటి హోదా వస్తుంది. క్లిక్‌ అయితే డబ్బుకు కొదవే ఉండదు. అదే చిన్న హీరోలు అంటే అండదండలు లేని హీరోల విషయానికి వస్తే వీరికి అనేక సినిమా కష్టాలు తప్పవు. కేవలం కథ మీద ఉన్న నమ్మకంతోనే సినిమాను ప్రారంభిస్తారు. పూర్తి చేయడానికి అనేక అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక అండదండలు అంతంత మాత్రమే. నిర్మాణంలో ఉండగా బిజినెస్‌ ప్రోత్సాహం లభించదు. అయినప్పటికీ ఎలాగోలా పూర్తిచేసి విడుదలకు సిద్ధమైతే థియేటర్లు దొరకవు. తీసిన సినిమా ప్రేక్షకుల చెంతకు చేరాలంటే అది థియేటర్‌ ద్వారానే మరో మార్గం లేదు. ఇక్కడ చిన్న హీరోల సినిమాలకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. థియేటర్లు కొందరి చేతుల్లో ఉండడం వల్ల వాటిని అద్దెకు తీసుకోవాలంటే అనేక ఇబ్బందులు వస్తాయి. సవాలక్ష కండీషన్స్‌. పెద్ద సినిమాలు లేని రోజుల్లో మాత్రమే కొందరికి థియేటర్లు దొరుకుతాయి. దొరికిన వెంటనే రిలీజ్‌కు ఏర్పాటుచేసుకోవాలి. ఈలో పు సినిమాకు ప్రమోషన్‌ చేసుకోవాలి. లేదంటే కనీస స్థాయి ఓపనింగ్స్‌ కూడా రావు. ఇన్ని అవరోధాలు దాటి రిలీజ్‌ చేసుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు.
ఇక హీరో అంటే కేవలం ఒక సినిమాతోనే తేలిపోదు. ఒకసారి హీరో అని ముద్రపడితే దాన్ని నిలుపుకోవడానికి కంటిన్యూ అవాల్సిందే. దీనికోసం ప్రతి ఏడాది సినిమాలు చేయాల్సిందే. అలాగే ఒకే ఒక సక్సెస్‌తో కొనసాగలేరు. వరుసగా హిట్‌ సినిమాల్లో నటించాలి. ఒక ఫ్లాప్‌ వస్తే లెక్కలన్నీ తప్పుతాయి. వరుసగా ఫ్లాపులు వస్తే పలకరించే వారే ఉండరు. హీరోలకు సైతం అభద్రత ఉంటుంది.
చిన్న హీరోల్లో చాలామంది కొన్ని సినిమాలు చేశాక కనుమరుగవుతున్నారంటే దానికి కారణం వారు నటించిన సినిమాలు ఆశించిన రీతిలో ఆడకపోవడం. ఈ లోపు కొత్త కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. పూర్వం హీరోలు దశాబ్దాలు కొనసాగితే ఇప్పటి తరం హీరోలు నాలుగైదు సినిమాలు చేశాక కనిపించడం లేదంటే కారణం సక్సెస్‌లు లేకపోవడమే.
హీరోగా నటించడం అంటే ఇదివరకు కేవలం ముఖకవళికలు బావుండి, అభినయించగలితే సరిపోయేదు. ఇప్పుడు అలా కాదు ఫైట్స్‌, పాటలు, హంగామా కావాలి. అంటే శారీరకంగా కూడా కష్టపడారి. ఇది అందరికీ వర్తిస్తుంది. తెలుగు సినిమాల హీరోల్లో కొంతమంది నిరుద్యోగులుగా సైతం మారుతున్నారు. హీరోగా నటించాక, ఇతర వృత్తుల్లోకి మారలేక ఆత్మన్యూనతా భావంతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. సెలబ్రిటీ హోదా కోల్పోతే ఎదురయ్యే మానసిక వేదన గురించి మాటల్లో చెప్పలేం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com